
RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా షూటింగ్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం చిత్రబృందం కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ బ్రిందా మాస్టర్ ఆధ్వర్యంలో ఓ అందమైన పాటను తెరకెక్కిస్తోందట. ఈ షెడ్యూల్ దాదాపు 15 రోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. పాట చిత్రీకరణ పూర్తయిన అనంతరం సినిమా యాక్షన్ భాగంపై మేకర్స్ పూర్తిగా దృష్టి సారించనున్నారు.
తదుపరి షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ ఆధ్వర్యంలో హై- యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ‘వీర’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారట. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా కొత్త లుక్‌లో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం. విభిన్నమైన కాన్సెప్ట్, భారీ యాక్షన్, కొత్త మేకోవర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.














