
Romanchakam: యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ-డ్రామా ‘రోమాంచకం’ (Romanchakam). ఈ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న నేపథ్యంలో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన బయటికి వచ్చింది.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల తర్వాత మరోసారి వంగా పిక్చర్స్‌తో కలిసి నిర్వాణ సినిమాస్ ఈ సినిమాను విదేశాల్లో రిలీజ్ చేయనుంది. అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్స్‌ను సెప్టెంబర్ 2న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తన సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్‌పై ఫస్ట్ టైం సమర్పిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు ఈ బ్యానర్‌పై తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రంతో ఫస్ట్ టైం సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా పేరు కనిపించనుంది. ‘మేమ్ ఫేమస్’తో గుర్తింపు పొందిన సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్గా కనిపించనున్నారు. వెంకటేష్ కాకుమాను, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాతో వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్‌గా పరిచయం అవుతుండగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “Love, Laughter & Thrills” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అందమైన ప్రేమకథతో ప్రారంభమై, ఆ తర్వాత ఊహించని మలుపులు, సస్పెన్స్, వినోదంతో సాగుతుందని చిత్రబృందం చెబుతోంది. కథ విన్న వెంటనే బాగా నవ్వానని, కామెడీ వెనుక బలమైన ఎమోషన్ ఉందని సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే వెల్లడించారు. సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఓవర్సీస్లో నిర్వాణ సినిమాస్ పంపిణీ చేయడం, సందీప్ రెడ్డి వంగా ప్రెజెంటేషన్‌లో తెరకెక్కుతుండటంతో ‘రోమాంచకం’పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.












