Ghaati Trailer: అనుష్క శెట్టి మళ్లీ భారీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు ‘ఘాటి’. బ్రిటిష్ కాలం నాటి ఘాట్ ప్రాంతాల్లో పని చేసిన ఘాటీల జీవితం, వారిని నేటి కాలంలో గంజాయి స్మగ్లింగ్‌లో ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే నేపథ్యంతో ఈ కథ ముందుకు సాగుతుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఒక సాధారణ మహిళగా మొదలైన అనుష్క పాత్ర, అనూహ్య సంఘటనల కారణంగా బాధితురాలిగా మారి, చివరికి క్రిమినల్‌గా ఎదిగి, లెజెండ్‌గా నిలిచే విధానాన్ని చూపించడం. ఈ మార్పులో అనుష్క శెట్టి తన పాత్రలో చూపించిన శక్తి, ధైర్యం ఇప్పటికే ట్రైలర్‌తోనే చర్చనీయాంశంగా మారింది.
ట్రైలర్‌లో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు ప్రేమజంటగా కనిపించగా, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ప్రతినాయకులుగా చైతన్య రావు, రవీంద్ర విజయ్‌లు ప్రభావం చూపించారు. అనుష్కను “సీతమ్మోరు లంకా దహనం చేs…” అంటూ చూపించిన సీన్ అభిమానుల్లో ‘అరుంధతి’ తరహా శక్తివంతమైన వైబ్‌ను రేపుతోంది. ఈసారి కూడా ఆమె పాత్రను దర్శకుడు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సినిమాను క్రిష్ స్నేహితులు రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. మొదట గత జూలై 11న విడుదల కావాల్సి ఉన్నా, గ్రాఫిక్స్ పనులు పూర్తికాక వాయిదా పడింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజున తేజ సజ్జ ‘మిరాయి’ మరియు శివకార్తికేయన్ ‘మద్రాసి’ కూడా థియేటర్లలోకి వస్తుండటంతో, బాక్స్ ఆఫీస్ పోటీ ఆసక్తికరంగా మారింది. అనుష్క కెరీర్‌లో ‘అరుంధతి’ తర్వాత ఇంత పవర్‌ఫుల్ పాత్ర దొరకడం ఇదే మొదటిసారి అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే, ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.













