
Varanasi: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘వారణాసి’ని సుమారు 50 భాషల్లో డబ్ చేసి, 120 దేశాల్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ సినిమా డబ్బింగ్ విషయంలో రాజమౌళి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో AI డబ్బింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ‘వారణాసి’ కోసం మాత్రం కృత్రిమ స్వరాలపై ఆధారపడకుండా నిజమైన డబ్బింగ్ ఆర్టిస్టులను ఎంపిక చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు, పాత్రల ఎమోషన్స్ ప్రతి భాషలోనూ సహజంగా ప్రేక్షకులకు చేరాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు 1500 మంది వాయిస్ ఆర్టిస్టుల స్వరాలను పరిశీలించి, ఆయా పాత్రలకు సరిపోయే గొంతులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇలా ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్కు ప్రాధాన్యత ఇస్తున్న రాజమౌళి.. డబ్బింగ్ విషయంలోనూ AI కంటే మానవ స్వరాలకే ప్రాధాన్యం ఇవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.














