
Vijay Devarakonda : రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా సూపర్ హిట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురయ్యా. కొన్నిసార్లు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను.
ఈ మూవీ రిలీజ్ అయ్యాక వస్తున్న రెస్పాన్స్ నాకు రష్మిక, రాహుల్ పంపిస్తుండేవారు. సొసైటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వుమెన్ ఎదుర్కోవడం బాధపడాల్సిన విషయం. రిలేషన్ షిప్స్ అంటే ఒకనొకరు గౌరవించుకోవాలి, ఒడిదొడుకుల్లో తోడుండాలి, పరస్పరం ఎదిగేలా సహకరించుకోవాలి. మీ రిలేషన్స్ లో సమస్యలు ఉంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కొంతమందికి ఆ అవేర్ నెస్ ఇస్తుంది. చెప్పినా మీ భాగస్వామి మీ మాట వినకుంటే అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీకు ఏది సరైనదో ఆలోచించుకోండి. రెగ్యులర్ సినిమా ఫార్మేట్ లెక్కలు వేసుకోకుండా సొసైటీలో ఉన్న ఇష్యూ నేపథ్యంగా రూపొందించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడం మామూలు విషయం కాదు. ఈ బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక ఆలోచన కలిగేలా చేసింది, అవగాహన కల్పిస్తోంది. మహిళలు బయటకు వచ్చి మాట్లాడే స్ఫూర్తిని భూమా కలిగించింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద నెంబర్స్ క్రియేట్ చేసే సినిమాలు కూడా ఇలాంటి ఇంపాక్ట్ ను సొసైటీపై, ప్రేక్షకులపై వేయలేవు. అందుకు ఈ మూవీ టీమ్ మెంబర్స్ అంతా గర్వపడాలి.
డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ఒక అఛీవ్ మెంట్ చేశారు. ఈ కథలో చెప్పినవి నా లైఫ్ లో ఫేస్ చేయలేదు. కానీ విన్నాను, విన్న నాకే ఇంత ఎమోషనల్ గా ఉంటే ఆ బాధను అనుభవించేవారికి ఎలా ఉంటుంది. రాహుల్ లాంటి డైరెక్టర్ ఈ ప్రపంచానికి కావాలి. రాహుల్ కు దగ్గరగా ఉన్న వాళ్లంతా ఆయన గురించి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇలా అందరి ప్రేమను పొందడం రాహుల్ అదృష్టం. రోహిణి గారితో మూవీస్ చేశాను గానీ ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత బాధ కలిగింది. దీక్షిత్ విక్రమ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అను చేసిన దుర్గ పాత్ర చూస్తుంటే ఇలాంటి స్నేహితురాలు ప్రతి అమ్మాయికి ఉండాలని అనిపించింది.
గీత గోవిందం నుంచి రష్మికను చూస్తున్నా. ఆమెకు భూమాకు చాలా పోలికలు ఉన్నాయి. తన కెరీర్ పీక్ లో ఉన్న ఈ టైమ్ లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి కథను నేను చెప్పాలి అని ముందుకొచ్చింది. రష్మిక కెరీర్, సక్సెస్ చూస్తుంటే హ్యాపీగా, గర్వంగా ఉంది. నన్ను ఎవరైనా ఏదైనా అంటే ఎదురెళ్తా, కానీ రష్మిక ఓపికగా ఉంటుంది. నువ్వేంటో ఒకరోజు ప్రపంచం తెలుసుకుంటుంది అని నేను చెప్పాను, అది నిజమైంది. భాగస్వామిని సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.
విజయ్ మాటలు విన్న రష్మిక భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ సినిమా తప్పకుండా చేయాలి, వీలైనంత త్వరగా చేయాలని అనుకున్నా. సినిమాలో నటిస్తున్నప్పుడు కూడా రాహుల్ ఒక వుమెన్ ఎమోషన్ ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకున్నాడు అనిపించింది. రాహుల్ ను కంప్లీట్ గా నమ్మి భూమా పాత్రలో నటించాను. భూమా లైఫ్ లో జరిగినవి కొన్ని నా లైఫ్ లోనూ చూశాను. నేనే తప్పు చేస్తున్నానేమో అనిపించేది. ఈ రోజు మా మూవీని థియేటర్స్ లో చూస్తూ చాలా మంది రిలీఫ్ అయినట్లు, ఫ్రీడమ్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. మా సినిమాకు, ఈ సినిమా మేము చేయడం వెనక ఉన్న ఉద్దేశం ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారు.
భూమా పాత్రకు మీరు కనెక్ట్ కావడమే, ఈ పాత్రపై మీరు చూపిస్తున్న అభిమానం అన్ని పురస్కారాల కంటే ఎక్కువ. ఈ సంతోషం ఒకవైపు ఉన్నా, మన సొసైటీలో ఇంతమంది అమ్మాయిలు భూమాలా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను మేము అనుకున్నట్లు చేసే ఫ్రీడమ్ ఇచ్చిన విద్య, ధీరజ్ గారికి థ్యాంక్స్. గీతా ఆర్ట్స్ మా వెనక అండగా ఉంది. డైరెక్టర్ రాహుల్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. దీక్షిత్ నటుడిగా ఒక జెమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో మొదటి నుంచి విజయ్ భాగమయ్యారు. ఈ రోజు మా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. విజయ్ లాంటి పర్సన్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటే అదొక బ్లెస్సింగ్ అనుకోవాలి అన్నారు.











