
Yash: కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌కు ‘కేజీఎఫ్’ సిరీస్ ఎంతటి గుర్తింపును తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని ‘రాకీ భాయ్’ పాత్రతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు ‘టాక్సిక్’లో ‘రాయా’గా సరికొత్త అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో ఈ రెండు పాత్రల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాకీ భాయ్, రాయా పాత్రల మధ్య ఉన్న ప్రధాన తేడాను యశ్ ఆసక్తికరంగా వివరించారు. తన దృష్టిలో రాకీ భాయ్ పాత్రకు కొన్ని బంధాలు, బాధ్యతలు, సామాజిక పరిమితులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా అతడి నిర్ణయాలు కుటుంబం, సంబంధాలు, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. అయితే ‘టాక్సిక్’లోని రాయా పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వమని యశ్ తెలిపారు. రాయా ఎలాంటి బంధనాలకు, సామాజిక నియమాలకు లొంగని వ్యక్తి అని వివరించారు. అతడిని ‘Untameable’గా అభివర్ణిస్తూ.. తనకు నచ్చిన విధంగా, ఎలాంటి భయాలు లేకుండా జీవించే స్వభావం రాయాకు ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాదు.. సమాజం తనపై ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయాన్ని రాయా ఏమాత్రం పట్టించుకోడని యశ్ స్పష్టం చేశారు. సమాజంలో కనిపించే కపటత్వాన్ని కూడా అతడు లెక్కచేయడని తెలిపారు. అందుకే రాయా పాత్రలోని స్వేచ్ఛ, తిరుగుబాటు ధోరణి, నియమాలను ధిక్కరించే స్వభావం.. రాకీ భాయ్‌తో పోలిస్తే మరింత భిన్నంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ‘టాక్సిక్’లో యశ్ పాత్రపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రాకీ భాయ్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి రాయా ద్వారా మరో కోణాన్ని చూపించేందుకు యశ్ చేసిన ప్రయత్నం ఎంతవరకు ఆకట్టుకుంటుందో సినిమా చూస్తేనే స్పష్టమవుతుంది.














