జ‌గ‌న్ హామీలు ఆచ‌ర‌ణ సాధ్య‌మా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడిఎక్కుతున్నాయి..మరికొద్ది రోజుల్లో శాసన సభ ఎన్నికలు రాబోతుండడం తో అధికారపార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు , వామపక్షాలు ఇలా అన్ని కూడా ఎన్నికల బరిలోకి సిద్ధమవుతున్నాయి. ఎవరికి వారు తమ హామీలను కురిపిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రజల ఫై వరాలు కురిపిస్తూ మళ్లీ అధికారం చేపట్టేందుకు భారీ కసరత్తులు చేస్తుంది. మరోపక్క వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు.

గత ఎన్నికల్లో మీము ప్రకటించిన హామీలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తూ జనాల్లోకి వెళ్తుందని వైస్సార్సీపీ ఆరోపిస్తూ తమ కొత్త హామీలు ప్రకటిస్తున్నారు. జగన్ ప్రకటిస్తున్న హామీలు అందరిలో కొత్త అనుమానాలు రేపుతోంది.

* అధికారంలోకి రాగానే.. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ. 15,000 అందిస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంతవరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునే పిల్లల హాస్టల్‌ ఖర్చు కింద ఏటా రూ. 20,000 ఇస్తాం.

* వృద్ధాప్య పెన్షన్‌ వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ నెలకు రూ. 2,000 పింఛన్‌ ఇస్తాం. వికలాంగులకు రూ. 3,000 పింఛను ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే వైఎస్సార్‌ చేయూత పెన్షన్‌ పథకం కింద నెలకు రూ. 2,000 అందిస్తాం.

* ప్రతి రైతు కుటుంబానికి రైతన్న భరోసా పేరుతో ఏటా మే నెలలో రూ. 12,500 ఇస్తాం. నాలుగు పర్యాయాలు రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50,000 అందిస్తాం. వడ్డీ లేని పంట రుణాలు, తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ ఇస్తాం. రూ. 3,000 కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట ధరను ముందే నిర్ణయిస్తాం. అదే రేటుకు ఎవరూ కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రూ. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు నిర్మించి, రైతులు ఉచితంగా వాడుకునే ఏర్పాట్లు చేస్తాం.

* వైద్యం ఖర్చు రూ. 1000 దాటే ఏ వ్యాధి అయినా ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తాం. ఎంతటి పెద్ద ఆపరేషన్‌ అయినా చేయిస్తాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా సరే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. తలసేమియా, మూత్ర పిండాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు.. డాక్టర్‌ సలహా మేరకు రూ. 10,000 పింఛన్‌ ఇస్తాం.

* డ్వాక్రా మహిళలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్యాంకులకు వెళ్లి.. అప్పు ఎంత ఉందో రశీదు తీసుకోండి. మా ప్రభుత్వం రాగానే ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. ఆ సొమ్ముతో ఏమైనా చేసుకోవచ్చు. బ్యాంకులకు వడ్డీ లెక్కలు కడతాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం.

* ప్రతి పేద వాడికీ ఇల్లు కట్టిస్తాం. ఏటా ఐదు లక్షలు చొప్పున ఐదేళ్లలో అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. ఆ ఇంటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేయిస్తాం.

* మూడు దఫాలుగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. తాగుడు మానివేసినప్పుడు ఎదురయ్యే సమస్యలకు చికిత్స కోసం ప్రతి నియోజకవర్గంలో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తాం. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాతే మళ్లీ ఓట్లేయండని అడుగుతాం.

* ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. ఆ ఊరి వాళ్లకే 10 మందికి అందులో ఉద్యోగమిస్తాం. ఇళ్లు, పెన్షన్‌, రేషన్‌కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ ఇవన్నీ 72 గంటల్లోనే మంజూరుచేస్తాం.
అధికారంలోకి వస్తే.. ఇమామ్‌లకు రూ. 10,000, మౌజన్‌లకు రూ. 5,000 గౌరవ వేతనం ఇస్తాం. మసీదు, చర్చి, గుడికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒక్కోదానికి రూ.15 వేలు ఇస్తాం.

ఇలా అన్ని ఇస్తామంటూ జగన్ చెపుతున్నాడు. ఇవన్నీ ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు..? ఆంధ్రరాష్ట్రానికి అంత ఆదాయం వస్తుందా..? ఇప్పటికే అప్పుల్లో ఉన్నామని అధికారపార్టీ అంటుంటే ఇవన్నీ అధికారంలోకి రాగానే ఎలా ఇస్తారు అనేది సామాన్య ప్రజల్లో కలుగుతున్న ప్రశ్నలు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.