అక్కినేని అస్తమయం

akkineniవెండితెరపై తన నట వైదుష్యంతో దశాబ్దాల పాటు తెలుగువారిని అలరించిన నట సామ్రాట్, దాదాసాహెభ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు(91) పరమపదించారు. మంగళవారం అర్థరాత్రి కానరానిలోకాలకు వెళ్లిపోయారు.అర్థరాత్రి దాటాల అక్కినేని ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బందిపడటంతో.. కుటుంబ సభ్యులు ఆయనను కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటనే వైధ్యులు ఎమర్జెన్సీ కి తరలించి ఆక్సిజన్ పెట్టినా.. ఫలితం లేకపోయింది. ఎమర్జెన్సీకి తరలించిన పది నిమిషాల్లోనే ఆయన శ్వాస ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. ఆ సమయంలో కూతరు నాగసుశీల, మనవడు సుశాంత్ పక్కనే వున్నారు.

ఇటీవలే తన ఒంట్లో నలతగా వుందని.. డాక్టర్లు క్యాన్సర్ అని తేల్చారని ప్రేక్షకులు దీవిస్తే నిండునూరేళ్లు జీవిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పిన అక్కినేని అంతలోనే అనంతలోకాలకు పయనమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాది మంది అభిమానులను విషాద సముద్రంలోకి ముంచేసిన ఈ ’బాటసారి’ బహూదూరం సాగిపోయారు. అక్కినేని మరణంతో.. తెలుగు చిత్రసీమ ఓ ఆనిముత్యాన్ని, ఓ అద్భుతాన్ని కోల్పోయింది. ఆయన మరణంతో.. తెలుగుచిత్ర సీమ శోక సముద్రంలో మునిగిపోయింది.

అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం వెంకటరత్నం-పున్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటినుంచే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక (ఆడ) పాత్రలను ధరించాడు. 1940 లో విడుదలైన “ధర్మపత్ని” ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం “శ్రీ సీతారామ జననం” (1944). ఆ చిత్రంలో రాముని పాత్రతో ప్రారంభించిన నటజీవితం బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో ఆంధ్రప్రేక్షకులను అలరించాడు. సినిమాల్లోనే కాదు, మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు.

అక్కినేనికి ముగ్గురు కూమర్తెలు (సత్యవతి, నాగసుశీల, సరోజ) ఇద్దరు కుమారులు (వెంకట్, నాగార్జున) మనమళ్లు (సుశాంత్, సుమంత్, నాగచైతన్య, అఖిల్). నాన్నగారు చివరిసారిగా అందరితో సంతోషంగా మాట్లాడారని తెలిపారు. అక్కినేని పార్థివదేహాన్ని ఉదయం 9.30నిమిషాలకు అన్నపూర్ణస్టూడియోస్ కి తీసుకురానున్నట్లు నాగార్జున తెలిపారు.