అనిత‌ర సాధ్యుడు అక్కినేని!

Anనాలుగో త‌ర‌గ‌తి కూడా చ‌ద‌వ‌లేదు..
ఇప్పుడు న‌లు దిక్కులా అత‌ని పేరు వినిపిస్తోంది!
అజాన‌భావుడు, అంద‌గాడూ కాదు..
కానీ ఆ రూపం మ‌దిని వీడి పోను.. అంటోంది!
ఇంట్లో మ‌నిషి, తోబుట్టువు
బంధువు, స్నేహితుడు
ఏదీ కాదు..
కానీ అన్నింటికంటే ఎక్కువే!!
మ‌న తెలుగు తెర బిడ్డడు
వెలుగునిచ్చిన వీరుడు
అక్కినేని…!
న‌భూతో – న‌భ‌విష్యత్ – ఇది వెండితెర‌పై అక్కినేని ప్రయాణం. ఎక్కడి రామాపురం? ఇంకెక్కడి చిత్రసీమ‌. తెలుగు సినిమాకి 83 యేళ్లు అయితే అందులో 74ఏళ్లు అక్కినేనివే. తెలుగు సినీ క‌ళామ‌త‌ల్లికి బిడ్డ అనాలా? తోబుట్టువు అనాలా?? అక్కినేని గురించి మాట్లాడుకోవ‌డం అంటే తెలుగు సినీ చ‌రిత్రను ఒక్కసారి వ‌ల్లించుకోవ‌డ‌మే. ఇంతింతై వ‌టుడింతై ఎదిగిన తెలుగు సినీ ప‌రిశ్రమ‌లోని ప్రతీ మ‌లుపులోనూ అక్కినేని ఉన్నారు. తాను గెలిచి, తెలుగు చిత్రసీమ‌ను గెలిపించిన బ‌హుదూర‌పు బాట‌సారి… అక్కినేని.

ANR Old Picఎన్టీఆర్ ప్రభంజ‌నం మొద‌ల‌వ్వక‌ముందే తెలుగు చిత్రసీమ‌లో అక్కినేనిలోని ఓ న‌టుడు జ‌న్మనెత్తాడు. ఆ విధంగా ఎన్టీఆర్‌ కి సీరియ‌ర్ అక్కినేనే. ఎన్టీఆర్ రాక‌మునుపే అక్కినేని పౌరాణిక‌, జానప‌దాల అంతు చూశారు. ఎన్టీఆర్ వ‌చ్చిన త‌ర‌వాత‌, అత‌ని దివ్యస్వరూప‌ముని గ‌మ‌నించిన త‌ర‌వాత అక్కినేని బెదిరిపోలేదు. నాకు పోటీ వ‌చ్చేస్తున్నాడు అని కృంగిపోలేదు. త‌న ప్లస్, మైస‌న్‌ లు అయ‌న‌కు బాగా తెలుసు. తాను ఎలాంటి క‌థ‌ల‌కు న‌ప్పుతాడో స‌రిగ్గా అంచ‌నా వేయ‌గ‌లిగారు. అందుకే పౌరాణిక బాధ్యత ఎన్టీఆర్ కి అప్పగించి-సోష‌ల్ క‌థ‌ల్ని తాను తీసుకొన్నారు. తాను ఎలాంటి పాత్ర‌ల‌కు న‌ప్పుతాడో అక్కినేనికి బాగా తెలుసు.

ANRఈ పాత్ర నువ్వు చేయ‌లేవు… అని ఎవ‌రైనా అంటే ఆ పాత్ర మెడ‌లు వంచి లొంగ‌దీసుకోవ‌డ‌మూ తెలుసు.
దేవ‌దాస్ పాత్ర అక్కినేనికి అప్పజెబుతుంటే అక్కినేని దేవ‌దాస్ గానా?? అంటూ హేళ‌న చేశారంతా. కానీ అక్కినేని దాన్ని ఓ ఛాలెంజ్ గాతీసుకొన్నారు. దేవ‌దాస్ పాత్ర చేయాలంటే అక్కినేనే చేయాలి అనేలా విజృంభించాడు. దేశంలోని దాదాపు అన్ని భాష‌ల్లోనూ దేవ‌దాస్ న‌వ‌ల‌ని సినిమా రూపంలోకి తీసుకొచ్చారు. కానీ అక్కినేని స్థాయిలో మ‌రో న‌టుడు ఆ పాత్ర‌ని మెప్పించ‌లేక‌పోయాడు.. ద‌టీజ్ అక్కినేని. ఓ విప్రనారాయ‌ణ‌, ఓ బాట‌సారి, ఓమూగ‌మ‌న‌సులూ.. ఇలా ఎన్నిని చెప్పేది..?? ప్రతీ పాత్రలోనూ అక్కినేని విజృంభ‌ణే క‌నిపిస్తుంది.

AN Raoఈ పాత్ర ఎందుకు చేయాలి?
చేస్తే నిర్మాత‌ల‌కు లాభం ఉంటుందా?
ఇలాంటి ప్రశ్న ప్రతీసారీ వేసుకొన్నారు అక్కినేని. అందుకే ఆయ‌న నిర్మాత‌ల హీరో. “ఈ సినిమా నాతో తీస్తే మీకు డ‌బ్బులు రావు. వేరే హీరోని చూసుకోండి. లేదంటే క‌థ‌ని మార్చండి“ అని నిర్మొహ‌మాటంగా చెప్పేవారాయ‌న‌. త‌న పాత్ర తీరు ఇష్టం లేక స‌దార‌మ అనే చిత్రాన్ని మ‌ధ్యలోనే వ‌దిలేశారు అక్కినేని. షూటింగ్ ద‌శ‌లోనే ఆగిపోయిన అక్కినేని సినిమా అదొక్కటే. అందులో అక్కినేనిది దొంగ వేషం. న‌న్ను దొంగ‌గా ప్రేక్షకులు చూడ‌లేరు. అలాంటి హావ‌భావాలు నేను పండించలేను. అని చెప్పి ఆ సినిమా నుంచి త‌ప్పుకొన్నారు అక్కినేని. కావాలంటే అప్పటి వ‌ర‌కూ అయిన ఖ‌ర్చు కూడా తిరిగి ఇచ్చేస్తాన‌ని చెప్పార‌ట‌. కానీ నిర్మాత‌లు తీసుకోలేదు. అది అక్కినేని నైతిక విజ‌యం.

Anr Smileఏఎన్నార్‌, ఎన్టీర్‌ల మ‌ధ్య విప‌రీత‌మైన పోటీ ఉండేది. కానీ అది ఎప్పుడూ వృత్తిగ‌తంగానే తీసుకొనేవాళ్లు. వ్యక్తిగ‌తంగా ఇద్దరూ మంచి స్నేహితులు. క‌ష్టసుఖాలు పంచుకొనేవారు. ప‌రిశ్రమ‌కే క‌ష్టమొస్తే అన్నద‌మ్ముల్లా చేయూత‌నిచ్చేవారు. అందుకే ఇద్దరినీ ప‌రిశ్రమ‌కు రెండు క‌ళ్లు అని అభివ‌ర్ణించేవారు. ఇప్పుడు ఆ వెలుగులు దూర‌మ‌య్యాయి. తెలుగు చిత్రప‌రిశ్రమ పెద్ద కొడుకు అక్కినేని.. సెల‌వంటూ వెళ్లిపోయాడు. ఆయ‌న జ్ఞాప‌కాలు, భావి త‌రాలకు అందించిన అనుభ‌వ పాఠాలు మాత్రమే మిగిలున్నాయి ఇప్పుడు.. జోహార్ అక్కినేని..