నాని ఫై సైబరాబాద్ పోలీసులు సెటైర్లు

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరమో తెలియంది కాదు…చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ లు నడపడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పదే పదే చెపుతున్నారు. ఈ మధ్య సినిమా స్టార్స్ ను వాడుకుంటున్నారు. సినిమా హీరోలతో నాలుగు మంచి మాటలు చెప్పించటం కాకుండా… వార్ని మీమ్స్ లో చూపిస్తూ మెసేజ్ ఇస్తున్నారు.

తాజాగా ‘చావు కబురు చల్లగా’ సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ విడుదలైంది. అందులో హీరో కార్తికేయ హెల్మెట్ లేకుండా బైక్ ని నిలబడి నడుపుతుంటాడు. వెనక సీటు మీద హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూర్చుని ఉంటుంది. ఈ పిక్ ని షేర్ చేసిన సైబరాబాద్ పోలీస్… ‘హెల్మెట్‌ పెట్టుకోండి బాలరాజు గారు.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరమూ ఉండదు’ అని క్యాప్షన్ ఇచ్చారు! ‘చావు కబురు చల్లగా’ మీమ్ సూపర్ వర్కవుట్ కావటంతో తాజాగా జాతీయ అవార్డు అందుకున్న జెర్సీ ని తమ వాడకానికి వాడుకున్నారు. నాని ఒక స్టిల్ లో హెల్మెట్ పెట్టుకుని బ్యాటింగ్ చేస్తుంటాడు. మరో స్టిల్ లో హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతుంటాడు. అప్పుడు సినిమాలో నాని కొడుగ్గా నటించిన గౌతమ్ ‘నాన్న నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న ‘ అంటాడు. కొనసాగింపుగా ‘బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో’ అంటాడు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.