Mega157 : మెగాస్టార్ 157.. మరో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కానుందా ?


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డేని జరుపుకునే అభిమానులకు ఇది ఒక పండగ లాంటి రోజు. అయితే మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి.

ఇక తాజాగా యూవీ క్రియేషన్స్‌.. తమ బ్యానర్‌పై చిరంజీవితో ‘మెగా157’ సినిమాను అఫీషియల్​గా ప్రకటించింది. ‘మెగా స్టార్ అనే శక్తి కోసం నిప్పు, నీరు, ఆకాశం, భూమి, వాయువు అనే పంచభూతాలు కలుస్తున్నాయి. ఈ సారి మెగామాస్​ యూనివర్స్​ను మించి ఉండబోతుందని’ అంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​ను చూస్తుంటే ఇది సోషియో ఫాంటసీ మూవీ అని అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక ఫాంటసీ మూవీకి సైన్ చేశారు.

అయితే 1990లో చిరంజీవి, శ్రీదేవి జంటగా.. ఫాంటసీ కథాంశంతో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు అదే తరహాలో వస్తున్న ‘మెగా157’ మరో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అవుతుందో లేదో చూడాలి మరి.

ఇకపోతే తన తొలి చిత్రం ‘బింబిసార’తో మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సక్సెస్ ఫుల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న ‘మెగా157’ చిరంజీవి కెరీర్‌లోనే మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ చిత్రంగా వుంటుంది.