గెటప్‌ శ్రీను ఒక ఆణిముత్యం : నాగబాబు

తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన కామెడీ షో జబర్దస్త్‌. ఈ కామెడీ షో ద్వారా తెలుగు పరిశ్రమకు పదుల సంఖ్యలో కమెడియన్స్‌ పరిచయం అయ్యారు. తెలుగు వారిని ఎంతగానో బుల్లి తెర ద్వారా నవ్విస్తున్న జబర్దస్త్‌ కమెడియన్స్‌ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు. కొందరు హీరోలుగా కూడా పరిచయం అయ్యారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌ టీం మెంబర్స్‌ అయిన సుధీర్‌, రామ్‌ ప్రసాద్‌, గెటప్‌ శ్రీనులు హీరోలుగా త్రీ మంకీస్‌ అనే చిత్రం తెరకెక్కుతోంది.

త్రీ మంకీస్‌ ప్రమోషన్‌ కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ముగ్గురు అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అన్నాడు. రామ్‌ ప్రసాద్‌ మంచి రచయిత మరియు నటుడు. సుధీర్‌ మంచి టైమింగ్‌తో నటించగల నటుడు. ఇక గెటప్‌ శ్రీను గురించి నేను గతంలో మాట్లాడే అవకాశం రాలేదు. ఇండస్ట్రీలో ఒక ఆణిముత్యం వంటి వాడు గెటప్‌ శ్రీను. తెలుగు సినిమాలో మాత్రమే కాదు ఇతర భాషల్లో నటించే సత్తా కూడా ఉన్న నటుడు గెటప్‌ శ్రీను. వాడిని సరిగ్గా ఉపయోగించుకుంటే అద్బుతం అంటూ నాగబాబు ప్రశంసల వర్షం కురిపించాడు.