‘జెర్సీ’ సినిమా ఫలితంపై నాని కామెంట్స్‌

నాని హీరోగా వచ్చిన గత చిత్రం ‘జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కి శ్రధ్దా శ్రీనాధ్‌ హీరోయిన్‌గా నటించిన జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు అయితే దక్కాయి కాని సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు అయితే నమోదు కాలేదు అని అందరు అనుకున్నారు. కాని తాజాగా గ్యాంగ్‌ లీడర్‌ చిత్రం విడుదల సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా నాని తన గత చిత్రం జర్సీ చిత్రం ఫలితంపై క్లీయర్‌గా తన అభిప్రాయంను వ్యక్తం చేశారు.

కొందరు జెర్సీ చిత్రంను ఫ్లాప్‌ అని లేదా మరో రకంగా అనుకుంటున్నారు. కాని నా అభిప్రాయం ప్రకారం సినిమా సక్సెస్‌ అయ్యింది. విమర్శకుల నుండి ప్రశంసలు దక్కడం, మంచి రివ్యూలు రావడం అలాగే 30 కోట్ల వరకు కలెక్షన్స్‌ రావడం జరిగింది. అంతే కాకుండా ఈ చిత్రంను పలు భాషల్లో రీమేక్‌ చేసేందుకు కూడా ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్‌ ముందుకు వస్తున్నారు. ఇంతటి మంచి స్పందన వచ్చిన సినిమాను గురించి పదే పదే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్నాడు.