‘ నాయక్ ‘ బాటలో ముందున్న ‘ సీతమ్మ..’ పాట !

mahesh chran venkiఈ ముగ్గుల పండక్కి రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. పెద్ద హీరోలు పోటీ పడుతున్నారు. ఆ సినిమాలేమిటో ప్రత్యేకంగా సినీ అభిమానులకు గుర్తు చేయవలసిన అవసరం లేదు.! ‘నాయక్’ తో రామ్ చరణ్ తన… మ్యాజిక్ మరోసారి చూపించడానికి సమాయత్తమవుతుంటే, వెంకటేష్, మహేష్ బాబు కలిసి… ;సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విరగ బూయించడానికి నడుం కట్టారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే వున్నాయి. ఈ పండక్కి బాక్స్ ఆఫీసు దడదడ లాడించే సత్తా ఈ రెండు సినిమాలకూ వుంది. రెండూ విభిన్నమైన జోనర్లే. ఒక దానితో ఒకటి పోల్చుకోలేం. ‘నాయక’ పూర్తి మాస్ ఎంటర్టైనర్ అయితే…’సీతమ్మ…’ కుటుంబ బంధాల నేపధ్యంలో సాగే సినిమా. అటు మెగా ఫాన్స్.. ‘నాయక్ ‘ కోసం… ఇటు మహేష్, వెంకీ ఫాన్స్ ‘సీతమ్మ’ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రెండిటిలో సంక్రాంతి విజేత గా నిలిచే సినిమా ఏది? 2013 లో తోలి హిట్ సాధించే సినిమా ఏది? అనే చర్చలు జోరందుకున్నాయి. యధావిధిగా ఫాన్స్ తమ తమ హీరోల సినిమాలను వెనకేసుకు వస్తున్నారు. వారి అభిప్రాయాలను, అంచనాలనూ పక్కన పెడితే… నాయక్ కంటే… సీతమ్మ ఓ అడుగు ముందు వుంది.ఈ విషయం ఆయా సినిమాల పాటలు వింటే అర్ధమవుతుంది.

nayak svscసంగీతం సగం బలం అని నమ్మే పరిశ్రమ మనది. పాటలు బాగుంటే సినిమాకి ప్లస్. ఈ విషయం దశాబ్దాలుగా నిరూపితమవుతూనే వుంది. ‘నాయక్’, ‘సీతమ్మ..’ పాటలు కేవలం ఒక్క రోజు వ్యవధిలో శ్రోతల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల పాటలనూ పోల్చి చూస్తే… ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమాకే ఎక్కువ మార్కులు
పడతాయి. ‘నాయక్’ ఎక్కువగా బీట్ ని నమ్ముకుంది. ‘సీతమ్మ’లో మెలోడీ శ్రావ్యంగా వినిపించింది. తమన్, మిక్కి మద్య జరిగిన తోలి పోరులో మిక్కీ నే గెలిచాడు. మూడు నెలల క్రితమే.. మిక్కీ తన తొలి అడుగు వేసాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టీజర్ లో వినిపించిన టైటిల్ సాంగ్… విపరీతంగా ఆకట్టుకుంది. రింగ్ టోన్ గా భలే పాపులర్ అయ్యింది. సినిమా కంటెంట్ ఏమిటో, ఆ సినిమా నుంచి ఏమి ఆశించ వచ్చో ఆ పాటతో చూచాయిగా చెప్పారు. మిగతా పాటలూ శ్రావ్యంగా వినిపించాయి. సిరివెన్నెల, అనంత
శ్రీరాం తమ కలాలను రాగాల వెంట పరుగులు పెట్టించారు. ‘ఆరడుగు ఉంటాడే..’, ‘ఆకాశం విరిగి పడితే…’ ఒక్కసారి వినగానే ఆకట్టుకునే విధంగా వున్నాయి. ‘ఇంకా చెప్పాలె’, ‘వాన చినుకు..’ క్లాస్ గా సాగాయి. సాధారణంగా మహేష్, వెంకీ లాంటి ఇద్దరు హీరో లను చూసి… పూనకంతో మాస్ బాణీ లను కొట్టేయెచ్చు. కానీ మిక్కీ అలా అనుకోలేదు. కధ చుట్టూ పాటలను పేర్చే ప్రయత్నం చేశాడు.

Mickey thamns‘నాయక్’ కోసం తమన్ అనుసరించిన ధోరణి పూర్తిగా వేరు. రామ్ చరణ్ అంటే దుమ్ము రేగిపోయే డాన్సులు కావాల్సిందే. లేకపోతే ఫాన్స్ బాధ పడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని రెచ్చిపోయాడు. ఎక్కువగా బీట్ ని నమ్ముకున్నట్టు అనిపించింది. ‘మాస్ కి నచ్చితే చాలు’ అనే పంధాలో వెళ్ళారు. ‘తూహే నాయక్’ పాట ఫాన్స్ కి నచ్చుతుంది.

Presentation1‘లైలా ఓ లైలా’లో ఎక్కువగా హిందీ పదాలు వినిపించాయి. పబ్ నేపద్యంలో సాగే పాటలా అనిపించింది. ఇక అందరూ ఆశ పెట్టుకున్న ‘శుభ లేఖ రాసుకున్నా’ పాట మాత్రం చాలా నిరాశ పరిచింది. అంత అందమైన మెలోడి ని తమన్ పాడు చేశాడు అని మెగా అభిమానులే చెబుతున్నారు. నిజానికి వినాయక్ సినిమాల్లో మ్యూజిక్ మైనస్…. అని చాలా మంది చెబుతుంటారు. ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నా మంచి
మ్యూజిక్ రాబట్టుకోవడం లో విఫలం అవుతూనే వుంటారు. ఆ వైఫల్యం ‘నాయక్’ పాటల్లోనూ కనిపించింది. పైగా తమన్ ఎప్పుడూ మెలోడికి ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించదు. ఆయన పాటలు డాన్స్ లు చేసుకోవడానికి తప్ప, గుర్తు తెచ్చుకుని పాడుకునేలా వుండవు. నాయక్ పాటలూ అందుకు మినహాయింపు కాదు. తెరపై చరణ్ డాన్సులే ఈ పాటలకు ఊపిరి పోయాలి. లేదంటే… ‘నాయక్’…ఆడియో ‘సీతమ్మ’ ముందు నిలబడడం కష్టమే.