రివ్యూ : `1` – నేనొక్కడినే

One Nenokkadineక‌న్‌ఫ్యూజ్‌… క‌న్‌ఫ్యూజ్‌ : తెలుగు మిర్చి రేటింగ్స్ :3/5

సుకుమార్ చాలా తెలివైనోడు. అత‌ని ఆలోచినలు విభిన్నంగా ఉంటాయి. ఎంత విభిన్నత అంటే… బుర్ర ఎక్కడో పెట్టి సినిమా చేస్తే అస్సలు అర్థం కాదు. త‌న‌తో పాటు ప‌రిగెట్టాలి. త‌న‌తో స‌మానంగా ఆలోచించాలి. ఆర్య, జ‌గ‌డం, ఆర్య 2, 100 % ల‌వ్… అన్నీ ఇలానే ఉంటాయ్‌. సామాన్య ప్రేక్షకుడికి దూరంగా వెళ్లి ఆలోచించ‌డం సుకుమార్ అల‌వాటు చేసుకొన్నాడు. అత‌ని ప్లస్ అదే! ఇప్పుడు ఆ ప్లస్సే మైన‌స్ అని.. వ‌న్ సినిమా నిరూపించింది. నిజానికి వ‌న్ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి క‌థ‌ని ఇది వ‌ర‌కు తెలుగు ప్రేక్షకులు ఇది వ‌ర‌కెప్పుడూ చూళ్లేదు. ఇలాంటి పాత్ర మ‌హేష్ ఎప్పుడూ చేయ‌లేదు. అయితే ఆ కొత్తద‌నం ప్రేక్షకుడు అర్థం చేసుకొనేలా ఉండాలి. ఎవ‌రికీ అంతుప‌ట్టని విదంగా ఉంటే ఫ‌లితం ఎంతలా ఉంటుందో… ఈ సినిమా చెప్పక‌నే చెబుతుంది. ఇంత‌కీ ఈ క‌థేంటంటే..

గౌత‌మ్ (మ‌హేష్ బాబు) ఓ రాక్ స్టార్‌. అత‌ని పాట‌ల‌తో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత‌లూగిస్తాడు. అత‌నికో గ‌తం ఉంది. కానీ దుర‌దృష్టం ఏంటంటే ఆ గ‌తం త‌న‌కు తెలీదు. కానీ వెంటాడుతుంటుంది. ఎవరో త‌న‌ని చంప‌డానికి ప్రయ‌త్నిస్తున్నట్టు భ్రమిస్తుంటాడు. ఆ ప్రయ‌త్నంలో ఒక‌రిని చంపేసి జైలుకెళ్లి లొంగిపోతాడు. విచిత్రం ఏంటంటే అత‌ను చంపాడు అనుకోవ‌డం భ్రమ‌. వైద్యులు అత‌నికో మాన‌సిక వ్యాధి ఉంద‌ని ధృవీక‌రిస్తారు. దాంతో ఈ గంద‌ర‌గోళం భ‌రించ‌లేక గోవా వెళ్లిపోతాడు. త‌న క‌ల‌లో వెంటాడుతున్న వ్యక్తి (కిల్లీడార్జ్ ) అక్కడా క‌నిపిస్తాడు. గౌత‌మ్‌ని వెంబ‌డిస్తూ స‌మీరా (కృతి స‌న‌న్ ) వ‌స్తుంది. ఆమె ఓ రిపోర్టర్‌. గౌత‌మ్ గ‌తం తెలుసుకోవాల‌ని ఆమె ప్రయ‌త్నం. గోవాలో కూడా గౌత‌మ్ పై దాడులు జ‌రుగుతుంటాయి. అక్కడే గౌత‌మ్‌కి ఈ దాడులు ఎందుకు జ‌రుగుతున్నాయో? ఎవ‌రు చేస్తున్నారో అర్థమ‌వుతుంది. గౌత‌మ్‌కి ఫ్లాష్ బ్యాక్ ఉంది. త‌న తండ్రిని ఎవ‌రో చంపేశారు. వాళ్లే… ఇప్పుడు త‌న‌ని చంప‌డానికి ప్రయ‌త్నిస్తున్నారు. ఇప్పుడు గౌత‌మ్ ముందు రెండు స‌వాళ్లున్నాయి. త‌న త‌ల్లిదండ్రులు ఎవ‌రు? వాళ్లను చంపింది ఎవ‌రు? ఈ రెండూ గౌత‌మ్‌కి ఎలా తెలిశాయి? ఎవ‌రు చెప్పారు? అన్నది వెండి తెర‌పై చూడాలి.

క‌థ‌ని ఇలా క్లుప్తంగా చెప్పడానికి చాలా తంటాలు ప‌డాల్సివ‌చ్చింది. మ‌ధ్యలో ఎన్నో క‌న్‌ఫ్యూజ‌న్‌లు. అవ‌న్నీ చెబితే మీరు క‌న్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకే క‌థ ఇలా టూకీగా చెప్పేశాం. ఇదో సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌. సూర్య గ‌జిని చిత్రానికి మ‌రో యాంగిల్ అనుకోవ‌చ్చు. గ‌జిని ప్రతి 15 నిమిషాల‌కు ఒక‌సారి మ‌ర్చిపోతుంటాడు. ఇక్కడ గౌత‌మ్ మాత్రం క‌ల‌ని నిజం, నిజాన్ని కల అనుకొంటుంటాడు. ఈరుగ్మత నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంటుంది. ఈ క‌థ‌లో చిక్కుముడులు చాలా ఉన్నాయి. కాక‌పోతే అవ‌న్నీ ప్రేక్షకులు ఆలోచించేలా కాకుండా.. గందర‌గోళానికి గుర‌య్యేలా ఉన్నాయి. మ‌న‌సు, మెద‌డూ తెర‌కు అంకితం చేసి సినిమా చూస్తే గానీ…. ఏం జ‌రిగింది? ఏం జ‌రుగుతోంది అనేది అర్థం కాదు.
ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో మ‌రిన్ని గంద‌ర‌గోళాలొచ్చాశాయ్‌. క‌థ‌ని ఎలా డ్రైవ్ చేయాలో తెలీక సుకుమార్ మ‌ధ్యలో స్టిరింగ్ వ‌దిలేశాడేమో అనిపిస్తుంది. దాంతో ఆ క‌న్‌ఫ్యూజ‌న్ మ‌రీ ఎక్కువైంది. లండ‌న్ వెళ్లి ఓ పాప్ స్టార్ రోడ్ల మీద ప‌రుగెడుతుంటే, అంద‌రినీ చంపేస్తుంటే.. ప‌ట్టుకొనే నాధుడే లేడా..?? మ‌రీ విడ్డూరం కాక‌పోతే. సినిమాలో ఇలాంటి లాజిక్కులు వెత‌క్కూడ‌దంటారు. కానీ ఇంట‌లెక్యువ‌ల్ అనుకొనే సుకుమార్ కూడా మ‌రీ ఇంత లాజిక్ లేకుండా సినిమా తీస్తే ఎలా….?? చివ‌ర్లో నాజ‌ర్ – మ‌హేష్ మ‌ధ్య న‌డిచిన క్లైమాక్స్ డ్రామా అయితే మ‌రీ దారుణం. కానీ మ‌హేష్ సినిమా క‌దా.. అత‌ని అంద‌మైన మొహం చూడ్డానికైనా థియేట‌ర్లో కూర్చుంటాం లెండి.

మ‌హేష్ అంద‌గాడు.. 360 డిగ్రీల‌లో ఏ కోణం నుంచి చూసినా అందంగా క‌నిపిస్తాడు.. అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు సుకుమార్‌. కానీ ఆ అందాన్ని ఎక్కడ వాడుకొన్నాడు. అత‌ని ప్రతిభ ఎక్కడ గుంజుకొన్నాడు.. మ‌హేష్ ఒక్క ఫ్రేములో కూడా న‌వ్వడు. అస‌లు ఈ సినిమాలో నవ్వుకొనే ఛాన్సేలేదు. మ‌హేష్ కి డైలాగులు కూడా త‌క్కువే. త‌ల ప‌ట్టుకొని ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చోవ‌డం మేన‌రిజం… అది ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల‌ది క‌దా..?? అస‌లు ఇంత క‌న్‌ఫ్యూజ్ సినిమా ఇది వ‌ర‌కు రాలేదు. ఇది నిజంగా ప్రయోగ‌మే. కాక‌పోతే ఇంత పెద్దస్టార్ తో, అంత పెద్ద బ‌డ్జెట్‌తో తీయాల్సిన ప్రయోగం అయితే కాదు. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా మ‌హా రిచ్‌గా ఉంది. అయితే లాభం ఏంటి?? ఆ రిచ్ నెస్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేయ‌లేడు. కృతిస‌న‌న్ బాగానే చేసింది. ఆమె ఓకే. కానీ మ‌హేష్ ప‌క్కన సూట్ కాలేదు. ఇక గౌత‌మ్ ఈ సినిమాకి అస‌లు సిస‌లైన ఎట్రాక్షన్‌. డైలాగులేం లేవు గానీ.. తెర‌పై ముద్దుగా క‌నిపించాడు. ఆ మాత్రం చేశాడంటే గ్రేట్‌. మ‌హేష్ తో ప‌నిచేయ‌డం దేవిశ్రీ‌కి ఇదే తొలిసారి. అయితే ఆ అవ‌కాశం ఏమాత్రం ఉప‌యోగించుకోలేదు. ర‌త్నవేలు కెమెరా, పీట‌ర్ హెయిన్స్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాని కాపాడ‌లేక‌పోయాయి.

ఇది నిజంగా ద‌ర్శకుడి వైఫ‌ల్యమే. మ‌హేష్ లాంటి స్టార్ ఎలా వాడుకోవాలో అర్థం కాలేదు. తెలివితేట‌ల‌తో సినిమా తీయాలి. కానీ ఇన్ని తెలివితేట‌ల‌తో తీస్తే… కంగాళీనే అవుతుంది. సంక్రాంతి పండ‌గ రెండు రోజుల ముందే తెస్తుంద‌నుకొన్న ఈ సినిమా సంక్రాంతి వ‌ర‌కూ ఉంటే గ్రేటే.

తెలుగు మిర్చి రేటింగ్స్ :3/5 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

click here for English Review