రివ్యూ : పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్

pusthakam-lo-konni-pegilu-m                                  తెలుగుమిర్చి రేటింగ్‌ : 2/5 Click here for English Review
సినిమాలో కొన్ని రీళ్లు మిస్సింగ్.. !
కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఒక‌ట్రెండు స‌న్నివేశాల వ‌ర‌కూ న‌వ్వుకోవ‌డానికి బాగుంటాయి. అయితే దాన్నే ప‌ట్టుకొని సినిమా అంతా లాగించేయాల‌ని చూస్తే… న‌వ్వుల పాలు కాక‌తప్పదు. కొన్ని లైన్లు విన‌డానికి సూప‌ర్‌ గా ఉంటాయి. కానీ దాన్నే రెండు గంట‌ల సినిమా పాటు దాన్నే ప‌ట్టుకొని లాగితే – చిరిగి చేతికొస్తుంది. ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ విష‌యంలోనూ అదే జరిగింది. ద‌ర్శకులు ప‌ట్టుకొన్న లైన్ భ‌లే బాగుంది. కానీ అది రెండు గంట‌ల సినిమాకి ప‌నికిరాదు. ఇందులోని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ న‌వ్విస్తాయి. కానీ సినిమా అంతా దానిమీదే ఆధార ప‌డ‌డంతో కంగాళీగా తయారైంది. ఇంత‌కీ ఈ పుస్తకంలో ఏం ఉంది? మిస్సయిన ఎలిమెంట్స్ ఏమిటి? చూద్దాం ప‌దండి.

విజ‌య్ ( శ్రీ‌), సంధ్య (సుప్రజ‌) ప్రేమించుకొంటారు. ముందు ఒప్పుకోక‌పోయినా వీళ్ల బాధ భ‌రించ‌లేక ఓకే అంటారు. పెళ్లికి ముందు. త‌న స్నేహితులు శివ (రాహుల్‌), స‌లీమ్ (మ‌స్త్ అలీ), బాలాజీ (స‌తీష్‌)ల‌తో క‌ల‌సి స‌ర‌దాగా క్రికెట్ ఆడ‌తాడు శ్రీ‌. బంతిని ప‌ట్టుకొనే క్రమంలో కింద ప‌డ‌తాడు. ఆ షాక్ వ‌ల్ల చిన్నమెద‌డుకి దెబ్బత‌గులుతుంది. దాంతో.. షార్ట్ టైమ్ మొమ‌రీ లాస్ వస్తుంది. సంధ్యని ప్రేమించిన విష‌యం, నిశ్చితార్థం కుదిరిన సంగ‌తి రెండూ మ‌ర్చిపోతాడు. ఏం చేయాలో తెలీక‌.. స్నేహితులు ఓ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి తీసుకెళ్తారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండిపొమ్మని డాక్టర్ స‌ల‌హా ఇస్తాడు. మ‌రుస‌టి రోజు నిశ్చితార్థం. అందుకే డాక్టర్‌ కి చెప్పకుండా విజ‌య్‌ని స్నేహితులు ఇంటికి తీసుకొచ్చేస్తారు. సంధ్యని చూస్తే విజ‌య్‌ ని అన్ని విష‌యాలూ గుర్తొస్తాయ‌ని స్నేహితుల న‌మ్మకం. నిశ్చితార్థం లో సంధ్యను చూసి `ఇదెవ‌త్తిరా బాబు.. దెయ్యంలా ఉంది..` అంటాడు. దాంతో క‌థ మొద‌టికి వ‌స్తుంది. సంధ్యని విజ‌య్ గుర్తుప‌ట్టాడా? లేదా? ఇద్దరికి పెళ్లి జ‌రిపించ‌డానికి స్నేహితులు ప‌డిన తిప్పలేమిటి? అనేదే ఈ సినిమా క‌థ‌.

రెండు రోజుల వ్యవ‌ధిలో జ‌రిగే క‌థ ఇది. లైన్ కూడా చిన్నదే. షార్ట్ టైమ్ మొమ‌రీలాస్ అనే కాన్సెప్ట్ ఇది వ‌ర‌కు చూశాం. గ‌జిని, నేను మీకు తెలుసా క‌థ‌లు అవే. అయితే ఈసారి పూర్తిగా ఎంట‌ర్‌ టైన్‌మెంట్ దారిలో వెళ్దామ‌నుకొన్నాడు ద‌ర్శకుడు. దానికి త‌గిన‌ట్టే స‌న్నివేశాలు అల్లుకొన్నాడు. స్నేహితుల గోల‌, క్రికెట్ ఆట‌, మెమ‌రీ లాస్ … ఈ స‌న్నివేశాల‌న్నీ చ‌క్కగానే కుదిరాయి. నిశ్చితార్థం ఎపిసోడ్ కూడా న‌వ్వొచ్చేలానే తీశారు. అయితే క‌థంతా ఒక్క అంశం చుట్టూనే తిర‌గ‌డంతో బోర్ కొడుతుంది. పైగా హీరోకి ఒక్కటే డైలాగ్ ఏమైంది? క్రికెట్ ఆడాం? అంటూ చెప్పిందే చెప్పడంతో ముందు స‌ర‌దాగానే అనిపించినా రాను రానూ విసుగొస్తుంది. ఈ డైలాగేంట్రా బాబూ.. అని జుత్తుపీక్కొనేంత పిచ్చి లేస్తుంది. దాన్ని కూడా కామెడీగానే తీసుకొంటారులే.. అనుకొని ఉంటాడు దర్శకుడు.

ఓ త‌మిళ చిత్రానికి రీమేక్ ఇది. అక్కడ కాసులు కురిపించిన క‌థ‌. ఇక్కడ మాత్రం తేలిపోయింది. కార‌ణం ఒక్కటే. త‌మిళంలో క‌థ‌ని క‌థ‌గా చూపించ‌డానికి ప్రయ‌త్నించారు. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు లేవు. పాట‌లూ లేవు. ఇక్కడ మాత్రం అలా కాదు. పాట‌లు పెట్టక‌పోతే బాగుండ‌దేమో అనుకొని అతికించేశారు. గంటన్నర‌లో తీస్తే డాక్యుమెంట‌రీ అంటారేమో అని రెండుగంట‌ల‌కు లాగారు. దాంతో సోది ఎక్కువైంది. శ్రీ బాగానే చేశాడు. కానీ డైలాగ్ చెప్పడంలో ఒక్కటే మాడ్యులేష‌న్‌. పాత్రకు అది స‌రిపోయింది. మిత్రబృందంలో న‌టించిన వారంతా బాగానే చేశారు. స‌లీమ్‌ గా మ‌స్త్ అలీ న‌ట‌న బాగుంది. అత‌ని పాత్ర కావ‌ల్సినంత వినోదం పంచింది. నేప‌థ్య సంగీతం బాగుంది. ద‌ర్శకుడు సాజిద్‌ కి మ‌రింత అనుభ‌వం అవ‌స‌రం. ఎందుకంటే ఇలాంటి క‌థ‌ల్ని తెర‌పై చూపించ‌డం అనుకొన్నంత సుల‌భం కాదు. ఎంత రీమేక్ క‌థ అయినా సన్నివేశాల్ని బాగా రాసుకోవాలి. ఆవిష‌యంలో త‌డ‌బాటుకు గుర‌య్యాడు ద‌ర్శకుడు. అక్కడ‌క్కడా కొన్న కామెడీ సన్నివేశాలు మిన‌హా సినిమాలో చెప్పుకోవ‌డానికి ఏం లేదు. త‌క్కువ బ‌డ్జెట్‌ లో తెర‌కెక్కించారు కాబ‌ట్టి – నిర్మాత సేఫ్ జోన్‌ లో ప‌డే అవ‌కాశం ఉంది.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5                                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.