రివ్యూ: ప్యార్ మే పడిపోయానె

pyar-me-padipoyane-telugu-r

                                     |Click here for English Review|

ప్యార్ మే పడి...పోయెనే‘ : తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5

ఎన్నిసార్లు, ఎన్ని సినిమాలు వచ్చినా, దర్శకులు మాత్రం చిన్న పాయింట్ దొరికింది కదా అని కెమేరా వెనక్కు చేరిపోవడం మానరు. నిర్మాత చెవిలో చేరి, సూపర్ పాయింట్ సార్.. హీరో తన చిన్నప్పుడు హీరోయిన్ కెమేరా కొట్టేస్తాడు. హీరోయిన్ అసహ్యం పెంచుకుంటుంది. కట్ చేస్తే, ఆ ఇద్దరు ప్రేమలో పడతారు. తీరా చేసి తాను అసహ్యించుకునేది అతగాడినే అని ఆమెకు, ఆమెకు తానంటే చచ్చేంత ద్వేషమని తెలుస్తుంది. అప్పుడేం జరిగింది. సినిమా ఎలా ముగిసింది…అంటూ లైన్ చెప్పేస్తాడు. నిర్మాత ఫ్లాట్. హీరో ఫ్లాట్.. సినిమా చుట్టేస్తారు. ప్రేక్షకులు ఫ్లాట్ గా పడిపోతారు. ఎందుకీ సమస్య. లైన్ ఆలోచించుకున్నంత జాగ్రత్తగా సీన్లు ఆలోచించుకోకపోవడం. లైన్ కోసం వెదుక్కున్న కొత్తదనాన్ని సన్నివేశాల్లో చూపించలేకపోవడం, సినిమా తీయడంలో కనబర్చిన ఉత్సాహాన్ని తెరపైకి తేలేకపోవడం. పాపం హీరో.. నిర్మాత.. తమకు చెప్పిన పాయింట్ ను తలుచుకుని మురిసపోతూ వుంటారు. సినిమా మాత్రం బకెట్ తన్నేస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ ‘ప్యార్ మే పడిపోయానె’.

చంద్రం (ఆది) చలాకీ కుర్రాడు. పాటలకు ట్యూన్ లు కడుతుంటాడు. ఎలాగైనా ఓ మంచి మ్యూజిక్ ఆల్బమ్ చేయాలన్నది ఆశ. అతగాడి జట్టులోనే వుంటుంది యుక్త (శాన్వి) కూడా. ఆమె సింగర్. ఈ ఇద్దరూ ప్రేమలో పడతారు. తీరా చేసి చిన్న ట్విస్ట్. చిన్నతనంలో యుక్త విడియో కెమేరా కొట్టేసి, ఫ్యామిలీతో మరో ఊరు జంప్ అయిపోయినవాడే ఈ చంద్రం. తాను పెరుగుతూనే, అతగాడిపై పగనూ పెంచుకుంటుంది యుక్త. ఇప్పుడు ఈ విషయం చంద్రంకు తెలుస్తుంది.. అక్కడి నుంచి చంద్రం, ఎలాగోలా తనపై యుక్తలో వున్న పగను తీసేయాలని ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. కానీ ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకునే ఆశిష్ వల్ల అది కాస్తా ఆమెకు తెలిసిపోతుంది. దాంతో జంట విడిపోతుంది. అలా విడిపోయిన జంట మళ్లీ ఎలా కలిసిందన్నది మిగిలిన సినిమా.

ఆది, శాన్వి మినహా మిగిలిన వారంతా ప్యాడింగ్ ఆర్టిస్టులే. చాలా మందే వున్నారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీవిశ్వనాధ్ వంటి సీనియర్లతో సహా. తన గెటప్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు ఆది. ఏ డ్రెస్ పడితే అది వేసేసుకోవడం, ముఖానికి మేకప్ చూసుకొకపోవడం. ఈ సినిమాలో ఆది ని చూస్తే, అయ్యో అనిపిస్తుంది. ముఖంపై పింపుల్స్ గోతులు కూడా కప్పుకోలేదు. పైగా ఆ హెయిర్ స్టయిల్ ఏమిటో, ఆ డ్రెస్ సెన్స్ ఏమిటో. పైగా పాటల్లో శాన్వి చీరకట్టుకుని పక్కన వంటే ఆది చాలా చిన్నగా అనిపించాడు. కాస్తయినా వళ్లు చేయాలి. డ్యాన్స్ లు బాగానే చేసాడు. డైలాగ్ డెలివరీ మీద కూడా దృష్టి పెట్టాలి. లొడలొడా మాట్లాడేయడం కాదు.

అనూప్ రూబెన్స్ సినిమాలను టేకిటీజీగా తీసేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. పాటలు సోసోగా వున్నాయి. ఆర్ ఆర్ కూడా అంతంత మాత్రమే. సురేందర్ రెడ్డి ఫోటోగ్రఫీ చాలా వరకు సాదా సీదాగానూ, కొన్ని సన్నివేశాల్లో బిలో ఏవరేజ్ గానూ వుంది. ఎడిటింగ్ పెద్దగా పని వున్నట్లు కనిపించలేదు.

దర్శకుడికి కాంటెంపరరీ కమర్షియల్ సినిమాలపై అవగాహన అంతగా వున్నట్లు కనిపించడం లేదు. వుండి వుంటే సన్నివేశాలు ఇంత పాత వాసన కొట్టేవి కాదు. సినిమా పాయింట్ ఆలోచించడంలో వున్న శ్రద్దను సన్నివేశాలు అల్లుకోవడంలో చూపించలేదు. చిన్న పాయింట్ తో సినిమా తీసేటపుడు బలమైన సన్నివేశాలు రాసుకోవాలి. అంతకన్నా బలమైన చిత్రీకరణ కావాలి. అక్కడే దర్శకుడు ముందు విఫలమయింది. ఆపైన సన్నవేశాలను బలంగా తెరకెక్కించాలి. అమెచ్యూరిటీ వ్యవహారం వుండకూడదు. కానీ ఈ సినిమాలో రొటీన్ సీన్లు తప్ప మరేమీ లేదు. పైగా టేకింగ్ లో ఉత్సాహం కనిపించదు. నాలుగు పాటలు, ఓ ఫైట్, ఎనిమిది సీన్లు అన్నట్లు సాగిపోయింది. మొత్తం మీద హీరో ఆదికి, దర్శకుడు రవి చావలికి మరో ఫెయిల్యూర్… ప్యార్ మే పడిపోయానె.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2/5                     – స్వాతి
***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు

|Click here for English Review|