రవితేజ ఇక మారడా …..!?

raviteja-stillsవెటకారానికి ఫ్యాంటు షర్టు వేస్తే – దానికి హీరోయిజం జోడిస్తే అది కచ్చితంగా వెండితెరపై రవితేజ చేసే సందడిలానే ఉంటుంది. పక్కా మాస్ కథ, అందులో కాస్త యాక్షనూ, కావల్సినంత కామెడీ, చిన్న ట్విస్టూ – రవితేజ సినిమాకి ఇంతకంటే ముడిసరుకు అవసరం లేదు. మిగతాదంతా తన భుజస్కంధాలపై వేసుకొని హాయిగా రెండున్నర గంటలు లాంగించేసే కెపాసిటీ ఉన్న కథానాయకుడాయన. రవితేజతో సినిమా తీసే నిర్మాత…రవితేజ సినిమా చూసే ప్రేక్షకుడూ ఇద్దరూ ఖుషీనే.

అయితే ఇదంతా గతవైభవమే! ఇప్పటి రవితేజ సినిమా ఇదివరకటిలా ‘కిక్’ ఇవ్వడం లేదు. ఆ ‘మిరపకాయ్’లో నిన్నటి ఘూటూ కనిపించడం లేదు. ఒకదాని తరవాత ఒకటిగా వరుస ఫ్లాపులు. ఈ మాస్ మహరాజాతో సినిమా తీసిన నిర్మాతల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సినిమా తీసినా..కొనేందుకు బయర్లు భయపడుతున్నారు. చూసేందుకు ప్రేక్షకుడూ జంకుతున్నాడు. సడన్ గా రవితేజకి ఏమైంది?

Raviteja-Stillచిన్నస్థాయి నుంచి, సైడు వేషాల నుంచి, కమిడియన్ పోస్టు నుంచి, హీరో నుంచి….సరసర మంటూ స్వయంకృషితో దూసుకొచ్చిన తేజం..రవితేజ. వడ్డే నవీన్, జేడీ చక్రవర్తి సినిమాల్లో సైడు వేషాలేసి, సంవత్సరం తిరిగేసరికి స్టార్ హీరోల్ సైడున చేరిపోయాడు. అంతా…రవితేజ కృషే. ‘ఏం చంటీ గడ్డం పెంచావ్’ అని అడిగితే ‘నీ కోసమే దా..’ అంటూ చేసిన వెటకారం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ‘కమీషనర్ కూతుర్లకు మొగుళ్లురారా..’ అంటూ కాస్త మోటుదనం ప్రదర్శించినా..ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయాడు. దాంతో రవి పాత్రలన్నీ పండాయి. రఫ్ అండ్ మాస్ లుక్కున్న పాత్రలు రవితేజ కోసం సిద్ధమైపోయాయి. హీరోగా ఎదిగాడు.

తొలి రోజుల్లో ‘అన్వేషణ’ లాంటి అనామక సినిమాలు చేసినా…పూరి జగన్నాథ్ తో పరిచయం రవితేజ కెరీర్ నే మార్చేసింది. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ హీరోగా తొలి విజయపు రుచి చూపిస్తే ‘ఇడియట్’తో దిమ్మతిరిగిపోయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనేంత టైమ్ లేదు. వరుస సినిమాలు, అన్నీ హిట్లే. దాంతో హిట్ హీరో అయిపోయాడు. మాస్ రాజాగా ఎదిగాడు. ఇప్పుడు మాస్ మహరాజా స్థాయికి చేరాడు. యేడాదికి నాలుగు సినిమాలు చేసే స్టామినా రవితేజ సొంతం. అయితే ఆ స్వీడే రవితేజని ఇబ్బందుల్లో నెట్టేసింది.

Idiot1చక చక సినిమాలు చేసేయాలి, విజయాల్ని క్యాష్ చేసుకోవాలీ అన్న తొందర్లో కథని పట్టించుకోలేదు. రొటీన్ పాత్రలు వచ్చినా ‘ఓకే’ అన్నాడు. కొన్ని తొందరపాటు నిర్ణయాలు కూడా తప్పుదోవ పట్టించాయి. దాంతో వరుస వైఫల్యాలు చుట్టిముట్టాయి. ‘అంజనేయులు’, ‘నిప్పు’, ‘వీర’, ‘దొంగలముఠా’, ‘దరువు’….ఇలా ప్రతీ సినిమా పరాజయమే. ‘దొంగలముఠా’ సినిమా కేవలం డబ్బుల కోసమే ఒప్పుకొన్నాడనే విమర్శలను తెచ్చిపెట్టింది. ఆఖరికి అచ్చొచ్చిన పూరి కూడా రవిని గాడిన పెట్టలేకపోయాడు. ‘దేవుడు చేసిన మనుషులు’ ఘోరంగా బోల్తా పడడంతో రవితేజ స్టామినా తగ్గిపోయిందా? అనే అనుమానాలకు మరిత బలం వచ్చింది.

Ravi Teja Nippu Movie First Look Photos 1‘రెమ్యునరేషన్ ఇస్తే చాలు…రవితేజ ఎలాంటి సినిమా అయినా చేస్తాడు’ అని కాస్త ఘూటుగా విమర్శించేవాళ్లూ ఉన్నారు. ఆ మాట నిజమే అని చెప్పేందుకు ఆయన నటించిన సినిమాల కంటే గొప్ప రుజువు ఏముంటుంది? ఇటీవల రవితేజ ఎంచుకొన్న సినిమాల్లో కథల్లో వైవిధ్యం మచ్చుకైనా కనిపించదు. పైగా చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తున్నాడనిపిస్తోంది. పోని.. గెటప్ అయినా ఛేంజ్ చేస్తాడా? అంటే అదీ లేదు. వయసు మీద పడిందనే విషయం ప్రతీ సినిమాలోనూ అర్థమవుతోంది. ఆహార్యం విషయంలోనూ శ్రద్ద తీసుకోకపోవడం కాస్త విడ్డూరంగానే తోస్తోంది. రవితేజ ఎనర్టీని దర్శకులు వాడుకోలేకపోతున్నారా? లేదంటే దర్శకుల అభిరుచికి తగినట్టు రవితేజ మౌల్ద్ కావడం లేదా? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు. కథల్ని జడ్జ్ చేయడంతో రవితేజ అనుభవం ఏమైంది? చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా, అవే తప్పుల్ని మాటి మాటికీ ఎందుకు చేస్తున్నాడు?

ravi-teja-sir-osthara-wallpapers-01‘ఇది నా సినిమా… నా ఇష్టం’ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సినిమా అంటే కోట్లతో ముడిపడిన వ్యాపారం. రవితేజ కింద ఉన్న ‘మినిమమ్ గ్యారెంటీ’ ట్యాగ్ లైన్ చూసే నిర్మాతలు ధైర్యంగా ముందడుగు వేసేవారు. ఇప్పుడా ధైర్యం కనిపించడం లేదు. రవితేజ సినిమాకెళ్తే కాలక్షేపం అయిపోతుంది అనుకొన్న ప్రేక్షకులకు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. అవే పాత్రలు.. అదే మేనరిజంతో మాస్ మహరాజా రొటీన్ గానే కనిపిస్తున్నాడు.

ravitejaరెండ్రోజుల క్రితం విడుదలయిన ‘ సారోచ్చారు ‘ సినిమా రవితేజ పరాజయ ప్రస్థానానికి మరో ఉదాహరణ. కథ, కథనం,పాత్ర, పాత్ర వ్యక్తిత్వం, దర్సకత్వం ఇలా అన్ని విషయాల్లోనూ  సారోచ్చారు సినిమా రవితేజ నిర్లక్ష్యానికి తాజా ఉదాహరణ. ఈ సినిమా తో రవితేజ కెరీర్ కు  ప్రమాద ఘంటికలు మొగుతున్నాయనే చెప్పాలి. వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్  నుంచి ‘ సారోచ్చారు ‘ లాంటి సినిమాను ప్రేక్షకులు ఊహించలేరు. ఇందులో అగ్ర నిర్మాత  అశ్వనీదత్తు నిర్లక్ష్యాన్ని కూడా ఆక్షేపించక తప్పదు. రవితేజ డెట్లు వుంటే చాలు…సినిమా  బిజినెస్ అయిపోతుందనే ధైర్యం మాత్రమే దత్తు ను ఈ సినిమా తీసేందుకు ప్రేరేపించిందా  అన్న నుమానం రాకమానదు.

Ravi-Teja-Kajals-first-look-in-Sarocharu-revealedరవితేజకు ఓ హిట్ కావాలి. ఎందుకంటే ఆయన నిర్మాతల హీరో. పరిశ్రమ సినిమాలతో కళకళలాడాలంటే రవితేజలాంటి కథానాయకులకు హిట్స్ రావాల్సిందే. తను ఎంత విలువైన కథానాయకుడో రవితేజ తెలుసుకోవడం లేదు. నిర్మాతలకు కొంగుబంగారంలాంటి ఈ కథానాయకుడు కథల ఎంపికలో తప్పులు చేసి.. తన ఓటమికి ద్వారాలు తానే స్వయంగా తెరచుకొంటున్నాడు. ఇకనైనా మాస్ మహరాజా మేలుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడాయన చేతుల్లో ఒక సినిమా వుంది..అదే ‘బలుపు’. ఈ సినిమానయినా విజయపు బాట పట్టించి తన తఢాకా చూపించవలసిన బాధ్యత పూర్తిగా రవితేజదే.అప్పుడే అటు నిర్మాతలకూ, ఇటు రవితేజ అభిమానులకూ ఆనందం. బి కేర్ ఫుల్ మాస్ మహారాజా…!