రివ్యూ : కో అంటే కోటి

ko-ante-koti
 
కో అంటే కోటి…. ఓరినాయనో ఇదేం సినిమా?

నటినటులు: శర్వానంద్,ప్రియా ఆనంద్,శ్రీహరి తదితరులు
సంగీతం : శక్తి కాంత్ కార్తిక్
నిర్మాత :శర్వానంద్
దర్శకత్వం :అనిష్ కురువిల్ల

Ko-Ante-Koti-Movie-Stills-Cinema65-1సినిమా వ్యాపారమే! కాకపొతే ఇప్పుడు జూదం అయిపొయింది. పస లేని కధ పై డబ్బులు తగల బెట్టడం, విషయం లేదని తెలిసినా… కోట్లు గుమ్మరించడంతో సినిమా నిర్మాణం పేకాట కంటే… ప్రమాదకరమైన ఆటగా మారి పోయింది. సినిమా అనేది దర్శకుడి ఇంటలెక్చువల్ లెవల్స్ చూపించడానికి కాదు. సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరచడానికి. ఆ విషయం తెలియక ‘కో అంటే కోటి’ సినిమాపై కొన్ని కోట్లు గుమ్మరించాడు శర్వానంద్. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. మంచి కధలు ఎంచుకునే నటుడిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్.. నిర్మాణ రంగంలో దిగాడంటే ఖచ్చితంగా అది… మహా గొప్ప కధే అయ్యుంటుంది అనుకుంటాం. పైగా ‘ఆవకాయ్ బిర్యాని’ లాంటి కళా ఖండం తీసిన దర్శకుడిని ఎంచుకున్నాడంటే ఆ కధపై నమ్మకంతోనే అనే లెక్కలు వేసుకుంటాం. కానీ… ‘కో అంటే కోటి..’ మన అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తుంది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? ఏం లేవు… తెలుసుకుందాం.

ko_ante_koti_movie_wallpapers_0812121257_011మాయ (శ్రీహరి) ఓ దొంగ. ఎన్నో దొంగతనాల కేసుల్లో అతని పేరు పోలీస్ రికార్డ్ లో ఎక్కింది. అతనో పెద్ద రాబరీ కి ప్లాన్ వేస్తాడు. డైమండ్ హౌస్ లో వున్న కోట్ల రూపాయలని కాజేద్దాం అనేది అతని ఆలోచన. ఈ దొంగతనానికి మరి కొంతమంది సహాయం కావాలి. అందుకోసం చిట్టి, బుజ్జి అనే ఇద్దరు దొంగలను తన గ్యాంగ్ లో కలుపుకుంటాడు. మరొకడు కావాలి. అందుకోసం వంశీ (శర్వానంద్) దగ్గరకు వెళ్తాడు. వంశీ కుడా దొంగే. ఎలాంటి భవనాలైనా తేలిగ్గా ఎక్కేయగలడు. అయితే… చాలాకాలం నుంచి దొంగతనాలకు దూరంగా వుంటాడు. ఈ ఒక్కసారి తనకు సహాయం చేయమని మాయ… బతిమాలతాడు, బెదిరిస్తాడు. తప్పని పరిస్థితిలో మాయ టీం లో చేరవలసి వస్తుంది. చాలా పకడ్బందీ గా ప్లాన్ చేస్తారు. చివరికి డైమండ్ హౌస్ లో వున్న కోట్ల రూపాయలు కాజేస్తారు. బుజ్జి, చిట్టిలను చంపి… వంశీ ని తుపాకి తో కాల్చి మాయ డబ్బులతో పరార్ అవుతాడు. వంశీ ప్రేమించిన అమ్మాయి సత్య (ప్రియానంద్) ని మరో ముఠా కిడ్నాప్ చేస్తుంది. దొంగిలించిన డబ్బు తీసుకొస్తే సత్యని వదిలిపెడతాం లేదంటే చంపేస్తాం… అని బెదిరిస్తారు. వంశీ… మాయ ని వెదుక్కుంటూ వెళ్తాడు. ఇంతకీ మాయ దొరికాడా? వంశీ, సత్య ల ప్రేమకధ ఎక్కడ మొదలయ్యింది? ఈ కధకు ముగింపు ఏమిటి.. ఈ విషయాలన్నీ ‘కో అంటే కోటి’ చూస్తే తెలుస్తాయి.

Sharwanand-Priya-Anand-Ko-Ante-Koti-Telugu-Movie-Stills-4కమర్షియల్ సినిమాల్లోలా ఓ ఫైట్, ఆ తరవాత పాట, ఈ లెక్కలు ఈ సినిమాకు లేవు. కధ అంతా ఓ దోపిడీ చుట్టూ తిరుగుతుంది. నలుగురు దొంగలు. నలుగురికీ నాలుగు కధలు. ఈ నలుగురి జీవితాల కామన్ పాయింట్… డబ్బు! శర్వానంద్ వాయిస్ ఓవర్ తో ఈ కధ మొదలవుతుంది. ప్రతీ పాత్రనీ వంశీనే పరిచయం చేస్తాడు. ఇలా డబ్బు చుట్టూ తిరిగే కధలు ఇదివరకు చాలా వచ్చాయి. వాటితో ఈ సినిమాని ఏమాత్రం పోల్చుకోలేం! ఇలాంటి కధలకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. ఈ సినిమా గమ్యం ఎలాంటిదో ప్రేక్షకులకి తొలి సన్నివేశాల్లోనే తెలిసిపోతుంది. ఆ తరవాత సినిమాని డ్రైవ్ చేయాల్సింది స్క్రీన్ ప్లే నే. ఈ విషయంలో ఈ సినిమా దారుణంగా తడబడింది. తెరపై ఒకదాని తరవాత మరో పాత్ర వచ్చి పడిపోతూ వుంటుంది. శ్రీహరి, శర్వానంద్ తప్ప తెలిసిన మొఖం ఒక్కటీ కనిపించదు. అందుకే తొలి సన్నివేశాలు గందరగోళంగా సాగుతాయి. మధ్యలో వంశీ ప్రేమకధ ఒకటి. ఏ పాత్రకూ బలమైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అందుకు తోడూ.. డైలాగులు పరమ మాస్ గా వున్నాయి. కొన్ని సన్నివేశాలు ‘పచ్చిగా’ చూపించారు. ఎక్కువగా ఇలాంటి ధోరణి తమిళ సినిమాల్లో కనిపిస్తుంది. ‘రా’ గా ఉన్న కధను ఏమాత్రం పాలిష్ చేయకుండా వదిలేస్తారు. అయితే.. అందులో ఆకట్టుకునే పాయింట్ వుంటుంది. ఈ సినిమాలో అది మిస్ అయ్యింది.

ko-ante-koti-movie-wallpapers-11డైమండ్ హౌస్ లో దాచుకున్న డబ్బులు ఎవరివి? దొంగతనం జరిగినా… ఎవరూ ఎందుకు కిమ్మనలేదు? ఈ విషయాలు ఎవరికీ అంతు పట్టవు. పైగా ఇలాంటి సినిమాల్లో మైండ్ గేమ్ వుండాలి. హీరో తన తెలివి తేటలతో.. చిక్కుముడులు విప్పాలి. కానీ అవేం ఈ సినిమాలో కనిపించవు. అనవసర సన్నివేశాలు కధని పాడు చేసాయి. క్లైమాక్స్ మరింత గందరగోళం. వంశీ మారాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. శర్వానంద్, శ్రీహరి, ప్రియానంద్…. ఏ ఒక్కరి నటనా ‘ఆహా’ అనే స్థాయిలో లేవు. కధలో బలం లేనప్పుడు.. ఎంత మంచి నటుడైనా ఏమి చేస్తాడు? సాంకేతికంగా ఈ సినిమా అంతంత మాత్రంగానే వుంది. ఆర్.ఆర్… చాలా సంభాషణలను మింగేసింది. పాటలు ఎందుకోస్తాయో… అందులో పదాలు ఏమిటో చెప్పిన వారికి కోటి రూపాయలు ఇవ్వొచ్చు. ఎడిటర్ చాలా బద్దకస్థుడేమో.. అనవసరపు సన్నివేశాలను చూసీ చూడనట్టు వదిలేసాడు. దర్శకుడి వైఫల్యం అడుగడుగునా కనిపించింది.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2.25/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.