దటీజ్ బాపు-రమణ..!!!

bapu ramanaఓ  సినిమాను తీయాలంటే భారీ ఖర్చు అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందునా ఓ పెళ్ళి సీన్ లేదా పెళ్ళి పాట చిత్రీకరించాలంటే ఆ సెట్ ఎంత భారీగా ఉండాలో అనిపిస్తోంది. ఈ విషయం తలచుకుంటూనే ముందుగా గుర్తొచ్చే భారీ సినిమా “వరుడు”… సినిమా మొత్తం భారీ భారీ సెట్టింగులు.. మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చైన డబ్బులు. తరువాత మురారి చిత్రంలోని అలనాటి రామచంద్రుడి పాట. ఇది కూడా బాగానే ఖర్చుచేసి తీసిన పాట. అయితే పెళ్ళి అంటూనే తప్పక వినిపించే, కనిపించే పాట బాపు గారి “పెళ్ళి పుస్తకం” లోని శ్రీరస్తు శుభమస్తు పాట. ఆశ్చర్యమేంటంటే ఈ పాటకి ఖర్చు దాదాపు వందల్లోనే అయిందట. వివరాల్లోకి వెళ్తే.. “శ్రీరస్తు శుభమస్తు” పాట షూటింగుకి ఆర్టు డిపార్ట్ మెంట్ కళ్యాణమండపం అద్దె, డెకరేషన్సు, జూనియర్స్‌, వారి కాస్ట్యూమ్స్ లెక్కేసి పొడుగాటి జాబితా తెచ్చారట. అయితే బాపు-రమణలు అవేవీ వద్దనుకుని ఓ తమాషా చేశారు. ఓ గదిలో నాలుగు ఇటుకలూ, పుల్లలూ, కాస్త మంట, ముగ్గులు, నాలుగు అరటి పిలకలు, నాలుగు మామిడి రెమ్మలు, ఓ కొబ్బరి బొండాం, మంగళ సూత్రం, పసుపు కలిపిన బియ్యం, ఓ పళ్ళెం, రెండు కర్రలకి పూలదండలు అమర్చుకుని టైట్‌ క్లోజ్‌ షాట్స్‌ తో ఓ పూటలో పాట ముగించేశారు. హీరో హీరోయిన్లు తప్ప జూనియర్లు లేరు. అక్షింతలు వేసిన చేతులు కూడా యూనిట్ వాళ్ళవే! అయినా సరే ఆ పాట ఎంత రిచ్ గా, నేచురల్ గా వచ్చిందే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. అందుకే కాబోలు రమణ గారు రాశారు “మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి” అని….!