ఆ ఇద్దరితో ప్రేమలో పడిన విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడిపోయాడు. ఆయన లేటెస్ట్ సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ చేతికి స్వల్పగాయమైంది. ఆ ఫొటోను ఆయన సోషల్‌మీడియా వేదికగా అప్పట్లో షేర్‌ చేశారు. అయితే ఆ ఫొటోను చూసి ఇద్దరు చిన్నారులు ‘ఏమైంది.. విజయ్‌ కొండకు ఏమైంది..?’‘డాక్టర్‌ దగ్గరికి వెళ్లు..’ అని సలహా కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోను చూసిన విజయ్‌ ట్వీట్ చేశారు. ‘వీరితో ప్రేమలో పడ్డా. విజయ్‌ దేవరకొండకు డాక్టర్‌ అవసరం లేదు, కానీ మీ ఇద్దర్నీ కలవాలి అనుకుంటున్నాడు.. మీకు కుదురుతుందా?’ అని అడిగారు. దీనికి సదరు నెటిజన్‌ సంతోషంగా రిప్లై ఇచ్చారు. ‘కచ్చితంగా.. మిమ్మల్ని కలిస్తే మా పిల్లలు చాలా ఆనందపడుతారు. మేం అమెరికాలోని ఫిలాడెల్ఫియా నుంచి శనివారం హైదరాబాద్‌కు రాబోతున్నాం’ అని అన్నారు. మొబైల్ నంబరు కావాలని విజయ్‌ టీం నెటిజన్‌ను కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ.. నమ్మలేక పోతున్నానని, ఇది ఎంతో స్వీట్ ట్రిప్‌ కాబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.