సైలెంట్ గా వచ్చి.. హిట్ కొడతారా?

greeku-veerudu-and-shadowపెద్ద సినిమా వస్తుందంటే ఆ హడావిడే వేరు. ‘బాద్ షా’ కి ముందు ఎంత హంగామా నడిచింది? ఆ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. ‘అలా ఉంటుందట, ఇలా ఉంటుందట’ అని చెప్పుకొన్నారు. అయితే ‘గ్రీకువీరుడు’, ‘షాడో’ సినిమాలు మాత్రం సైలెంట్ గా వస్తున్నాయి. ఈ సినిమాల గురించి ఎవరికీ ప్రత్యేకమైన అంచనాలు లేవు. ఇలా లోప్రొఫెల్ లో ఉండడమే నయం అని నాగార్జున, వెంకటేష్ లు భావిస్తున్నారేమో? సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నారేమో? నిజానికి ఇద్దరి సినిమాలకు ప్రచారం
అక్కర్లేదు. ఎప్పుడొచ్చినా జనం చూస్తారు. పైగా వేసవి సీజన్. పెద్ద సినిమాల్లేక బాక్సాఫీసు బోసిపోతోంది. ‘బాద్‌ షా’ ఆలోటు తీర్చింది. ‘షాడో’, ‘గ్రీకువీరుడు’ కూడా జనం ముందుకు వస్తే.. మరింత సందడి మొదలైపోతుంది. ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరించడానికి ప్రేక్షకులూ సిద్ధమే. దశరథ్ సినిమాలన్నీ లో ప్రొఫైల్ లోనే సాగుతాయి. ‘మిస్టర్ పర్ ఫెక్ట్’పై కూడా ఎవరికీ అంచనాల్లేవు. కానీ హిట్ కొట్టింది. అదే ఫీట్ ‘గ్రీకువీరుడు’లో కొనసాగిస్తే.. నాగ్ అభిమానులకు పండగే.

మరోవైపు మెహర్ రమేష్ కసితో ఉన్నారు. ‘శక్తి’ పరాభవం మర్చిపోవాలనే దీక్షతో ‘షాడో’ కోసం పనిచేశారు. కోనవెంకట్ లాంటి రచయిత అండా, దండా ఈ సినిమాకు ఉంది. వెంకటేష్ బలం.. ఫ్యామిలీ ఆడియెన్స్. వారిని థియేటర్ కి రప్పించే అంశాలు ఈ సినిమాలోనూ ఉన్నాయట. ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ విళితంగా సాగితే, సెకండాఫ్ సెంటిమెంట్, యాక్షన్ లను పండించారట. వెంకీ సినిమా నుంచి ప్రేక్షకులు ఇంతకంటే ఎక్కువగా కోరుకోరు. పైగా వెంకటేష్-శ్రీకాంత్ లది అచ్చొచ్చిన కలయిక. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకీ వర్కవుట్ అయితే.. ‘షాడో’ మెప్పించినట్టే. ఏదేమైనా ఈ నెల 26న ఈ అగ్రకథానాయకుల సినిమాల జాతకం బయటపడనుంది. ఎవరికి ఎన్ని మార్కులొస్తాయో, ఏ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి మరి.