రివ్యూ : ఎవ‌డు

Yevadu-Review

ఈ సంక్రాంతికి మొన‌గాడు : ఎవ‌డు                                           తెలుగు మిర్చి రేటింగ్స్ :3.5/5

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీసినంత/ చూసినంత సుఖం లేదు. నీకు కావ‌ల్సింది నువ్వు తీసుకో.. నాకు కావాల్సింది నాకు ఇచ్చుకో… అనే విన్ విన్ ఫార్ములాని మించి ఏముంటుంది? క‌మ‌ర్షియ‌ల్ సినిమా కూడా అంతే! కాక‌పోతే ఆ నాడీ ప‌ట్టుకోవాలి. ఆ హీరో ఇమేజ్‌, ప్ల‌స్సూ, మైన‌స్ – అభిమానుల అంచ‌నాలు ముందే కొలిచేయాలి. ఏ సీన్‌కి విజిల్స్ ప‌డ‌తాయ్‌? సినిమాలో ఎక్క‌డెక్క‌డ మ‌లుపులు ఇవ్వాలి? సినిమాని ఎప్పుడు హైపిచ్‌లోకి తీసుకెళ్లాలి?? ఈ సంగ‌తుల‌న్నీ తెలిస్తే వాణిజ్య సినిమాలు న‌ల్లేరు మీద న‌డ‌క‌. ఎవ‌డు టీమ్ అదే చేసింది. ఓ హాలీవుడ్ లైన్‌ని ప‌ట్టుకొని దానికి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా ట్రీట్ మెంట్ ఇచ్చింది. మాస్ ని మెప్పించి, అభిమానుల్ని ఒప్పించి, బాక్సాఫీసును గెలిచేందుకు కావ‌ల్సిన అన్ని అర్హ‌త‌ల‌నూ త‌న‌లో నింపుకొంది. ఇక ఆల‌స్యం చేయ‌కుండా ఈ సినిమా రివ్యూలోకి ఎంట‌రైపోదాం.

దీప్తి (కాజ‌ల్‌) స‌త్య (అల్లు అర్జున్‌) ఇద్ద‌రూ ప్రేమించుకొంటారు. కానీ వీరూభాయ్ (ముకుల్‌దేవ్) దీప్తిపై మ‌న‌సు ప‌డ‌తాడు. అత‌నో దాదా. వ‌ల‌చిన అమ్మాయిని అనుభ‌వించ‌నిదే వ‌ద‌ల‌డు. దీప్తిని కూడా పొందాల‌నుకొంటాడు. కానీ స‌త్య అడ్డుత‌గులుతాడు. దాంతో వీరూభాయ్ మ‌నుషులు దీప్తిని చంపేస్తారు. స‌త్య చావుబ‌తుకుల మ‌ధ్య ఆసుప‌త్రికి చేర‌తాడు. అత‌న్ని ఓ డాక్ట‌ర్ (జ‌య‌సుధ‌) బ‌తికిస్తుంది. కానీ స‌త్య మొహం పూర్తిగా కాలిపోతుంది. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేసి మ‌రొమొహం (రామ్‌చ‌ర‌ణ్‌) అతికిస్తుంది. ర‌గులుతున్న ప‌గ‌తో స‌త్య (రామ్‌చ‌ర‌ణ్‌) త‌న శ‌త్రువుల‌ను వెతుక్కొంటూ వెళ్తాడు. రామ్‌గా పేరు మార్చుకొని ఒకొక్క‌రినీ తుద‌ముట్టించి త‌న ప‌గ తీర్చుకొంటాడు. అయితే ఇప్పుడు రామ్‌ని మ‌రో గ్యాంగ్ వెంటాడుతుంది. అలా వెంటాడుతున్న గ్యాంగ్ ఎవ‌రు?? అస‌లు స‌త్య కొత్త మొహం వెనుక ఉన్న క‌థేంటి?? అన్న‌ది ఎవ‌డు స్టోరీ.

ఇది ఫ‌స్టాఫ్ క‌థ మాత్ర‌మే సెకండాఫ్‌లో ఇంకో `సినిమా` ఉంది. అదెంటో.. తెర‌పై చూస్తే బాగుంటుంది.

ఇది మామూలు ప‌గ – ప్ర‌తీకారాల ఫార్ములానే. కాక‌పోతే ఒక ప‌గ కాదు. రెండు ప‌గ‌లు. అదే కాస్త కొత్త‌గా ఉంది. పైగా ఒక‌రి స్థానంలో మ‌రొక‌రు వ‌చ్చి ప‌గ తీర్చుకోవ‌డం అన్న కాన్సెప్ట్ తెలుగు సినిమా వ‌ర‌కూ కొత్త‌దే. సినిమా మొదలైన పావుగంట థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. బ‌న్నీ ప్లేసులోకి చ‌ర‌ణ్ రావ‌డం.. వ‌ర‌కూ సినిమా హైపిచ్‌లో ఉంటుంది. అయితే స‌త్య త‌న ప‌గ తీర్చుకోవ‌డం అనే ఎపిసోడ్ అంతా.. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములానే. కానీ ఇంట్ర‌వెల్ ట్విస్ట్ తో మ‌ళ్లీ సినిమాకి ప్రాణం పోశాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డే ఎవ‌డు… అస‌లు క‌థ మొద‌లైన‌ట్టు. ప్లాస్టిక్ స‌ర్జ‌రీతో వ‌చ్చిన ఓ రూపానికి మ‌రో ఫ్లాష్ బ్యాక్ జోడించి సెకండాఫ్‌కి అదిరిపోయే లీడ్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండాఫ్‌లో మ‌రో క‌థ మొద‌ల‌వుతుంది. ప్రేక్ష‌కుల‌కు ఒక్క టికెట్ పై రెండు సినిమాలు చూసిన ఫీలింగ్ ఉన్నా – సెకండాఫ్‌లో ద‌ర్శ‌కుడు పండించిన ఎమోష‌న‌ల్ డ్రామా, సాయికుమార్ పాత్ర ఇవ‌న్నీ పండ‌డంతో స‌గ‌టు సినిమా అభిమాని సంతృప్తిగా థియేట‌ర్‌ని వ‌దిలి బ‌య‌ట‌కు వ‌స్తాడు.

రామ్‌చ‌ర‌ణ్ సినిమా అంటే డాన్సులు, ఫైటింగులు, డైలాగులూ ఇవి ఊహించి థియేట‌ర్‌లో అడుగు పెడ‌తాడు మెగా ఫ్యాన్‌. వాళ్లంద‌రినీ ఈ సినిమా సంతృప్తిప‌రిచింది. దానికితోడు ఫేస్ ఆఫ్ సినిమా పాయింటు కాబ‌ట్టి మ‌న‌వాళ్ల‌కు కొత్త‌గా అనిపిస్తుంది. సినిమాని ఎక్క‌డ పైకి లేపాలో వంశీపైడిప‌ల్లి బాగా క‌నిపెట్టాడు. ఈ విష‌యంలో రాజ‌మౌళి ఫార్ములా అనుస‌రించాడు అనిపించినా… ఓకే! సెకండాప్‌లో ఎమోష‌న్స్ ఎక్కువ‌య్యాయి. రిలీఫ్ పాయింట్ అన్న‌ది లేనే లేదు. బ్ర‌హ్మానందం ఉన్నా అదీ ఒకట్రెండు సన్నివేశాల వ‌ర‌కే. ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్‌ని వాడుకోవ‌ల‌సింది. కానీ అటువైపు దృష్టిసారించ‌లేదు ద‌ర్శ‌కుడు. సినిమా మొత్తాన్నీ ఒకే టెంపోలో న‌డ‌ప‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చిన ద‌ర్శ‌కుడు కామెడీ ని మ‌ర్చిపోయాడు. హీరోయిన్ల‌ను కూడా. ఇద్ద‌రున్నా వాళ్లు కేవ‌లం నామ‌మాత్ర‌మే. శ్రుతిహాస‌న్ కంటే… అమీజాక్స‌నే కాస్త బెట‌ర్ అనిపించింది. సాయికుమార్‌ని మ‌న‌వాళ్లు ఎందుకు వాడుకోలేక‌పోతున్నారో అర్థం కావ‌డం లేదు. అత‌ని గొంతుకు జోహార్ అర్పించాల్సిందే. మామూలు సంభాష‌ణ‌ని కూడా బేస్ వాయిస్‌లో చెప్పి, కంగారు పుట్టించాడు. ఎవ‌డు సినిమా చూసిన త‌ర‌వాత మ‌న ద‌ర్శ‌కుల ఆలోచ‌న ధోర‌ణి మారుతుందేమో.. క‌నీసం సాయికుమార్‌ని వాడుకొనే విష‌యంలో..?!

ఇక రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికొస్తే.. అభిమానుల‌కు కావ‌ల్సిన‌ట్టుగా న‌టించాడు. తొలిసారి పూర్తిస్థాయి ఎమోష‌న‌ల్ పాత్ర‌లో క‌నిపించాడు. సంభాష‌ణ‌లు ప‌లికేట‌ప్పుడు నాన్న‌ని గుర్తుకు చేయ‌డం ఈసారీ ఫాలో అయ్యాడు. అఫ్‌కోర్స్ అభిమానుల‌కు కావ‌ల్సింది అదే. రెండు పాటల్లో త‌న డాన్సింగ్ టాలెంట్ చూపించాడు. బ‌న్నీ ఉన్న‌ది కాసేపే అయినా ఈ సినిమాకి త‌నే ప్రాణం. బ‌న్నీ కాకుండా మ‌రొక‌రు ఆ పాత్ర చేసుంటే… అంత‌గా రిసీవ్ చేసుకొనేవాళ్లు కాదేమో..? జ‌య‌సుధ‌కీ చాలాకాలం త‌ర‌వాత మంచి పాత్ర ప‌డింది. సాయికుమార్ – జ‌య‌సుధ మ‌ధ్య న‌డిచిన సంభాష‌ణ‌కు థియేట‌ర్లో గోల గోలే!

అయితే ఎప్ప‌ట్లానే ఈ సినిమాలోనూ లాజిక్కులు మిస్ అయ్యాడు. విశాఖపట్నంలో జ‌రిగిన మూడు హ‌త్య‌ల‌కూ బాధ్య‌త ఎవ‌డు? అస‌లు ఆ ఇన్వ‌స్టిగేష‌న్ ఏమైన‌ట్టు? ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేస్తే గొంతు కూడా మారిపోతుందా?? అస‌లు ఆ విష‌యం దాచి పెట్టి ఉంచ‌గ‌ల‌రా?? ఇలా ఎన్ని అనుమానాలో..? యాక్ష‌న్ ఘూటు మ‌రీ ఎక్కువైంది. సంక్రాంతి పండ‌గ అని సినిమాకి వ‌చ్చిన కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అది ఎంత వ‌ర‌కూ న‌చ్చుతుందో…? సాంకేతికంగా దిల్ రాజు సినిమాల‌కు పేరు పెట్ట‌లేం. అన్ని విష‌యాల్లోనూ వేలెత్తి చూపించ‌కుండా ఈ సినిమాని తీర్చిదిద్దాడు. దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో..! అక్క‌డక్క‌డ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను వాడుకొని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశాడు ద‌ర్శ‌కుడు!

ఈ సినిమా క్లాసిక్కో, మైండ్ బ్లోయింగో, మ‌రోటో మ‌రోటో కాదు. జ‌స్ట్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా. అంద‌రికీ కావ‌ల్సిన అన్ని అంశాలూ ఉన్నాయ్‌. హాయిగా చూసేయండి. సంక్రాంతి పండ‌గ చేసుకోండి.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 3.5/5                                                                                                    – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

click here for English Review