14 కొత్త జిల్లాలకు శ్రీకారం..

KCR-Birthdayమ‌రో ఎన్నిక‌ల హామీని అమ‌లు చేసేందుకు టిఆర్ ఎస్ స‌ర్కార్ స‌న్న‌ద్ద‌మౌతోంది. తెలంగాణా ఉద్య‌మ స‌మ‌యం నుండి తెలంగాణాలో ప‌లు జిల్లాల ఏర్పాటుకు ఉద్య‌మ నాయ‌కునిగానే కేసీఆర్ హామీలు ఇస్తూ వ‌చ్చారు. ఎన్నిక‌ల స‌భ‌ల్లోనూ ఇదే విష‌యాన్ని ఆయా ప్రాంతాల్లో స్ప‌ష్టంగా చెప్తూ వ‌చ్చారు. ఈ మేర‌కు తెలంగాణాలో జిల్లాల విభ‌జ‌న‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్‌శ‌ర్మ నేతృత్వంలో విధివిధానాల‌ను ఖ‌రారు చేసేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను పునర్విభజించి మొత్తం 24 జిల్లాలను ఏర్పాటు చేయాలనే ఆలోచ‌న‌లో సీయం కేసీఆర్ ఉన్నారు. ప్ర‌స్తుతం దేశంలో 19 ల‌క్ష‌ల జ‌నాభాకు స‌గ‌టున ఒక జిల్లా ఉంటే…తెలంగాణాలో మాత్రం 35 ల‌క్ష‌ల జ‌నాభాకు ఒక జిల్లా ఉంది. దీంతో ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం 15 ల‌క్ష‌ల జనాభాకే ఒక జిల్లాను ఏర్పాటు చేసే దిశ‌గా రంగం సిద్ద‌మౌతోంది.

జిల్లాల విభ‌జ‌న సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుండి కొత్త డిమాండ్లు త‌లెత్త‌కుండా టిఆర్ ఎస్ స‌ర్కార్ జాగ్ర‌త్త‌లు ప‌డుతోంది. ప‌రిపాల‌నా సౌల‌భ్యం, ప్ర‌జా సౌక‌ర్య‌మే ల‌క్ష్యంగా జిల్లాల ఏర్పాటుకు ఆలోచ‌న చేస్తోంది. దీంతో తొలి ద‌శ‌లో 10 జిల్లాల‌ను మాత్ర‌మే ఏర్పాటు చేసి…ఆ త‌ర్వాత వ‌చ్చే డిమాండ్ల‌కు అనుగుణంగా మ‌రో నాలుగు జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌వ‌చ్చనే భావ‌న‌లో స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొద‌టి విడ‌త‌లో ప్ర‌స్తుతం ఉన్న రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల‌ను ఐదు జిల్లాలుగా విభ‌జించాల‌ని భావిస్తోంది. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, వికారాబాద్‌, రంగారెడ్డితో పాటు హైద‌రాబాద్ ఈస్ట్ జిల్లా ఏర్పాటుకు అవ‌కాశాలున్నాయి. ఇక మెద‌క్‌తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట‌లు జిల్లా కేంద్రాలు కానున్నాయి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వ‌న‌ప‌ర్తిని మొద‌టి విడుత‌లోనూ…నాగ‌ర్ క‌ర్నూలును రెండో విడ‌త‌లోనూ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. నల్లగొండతో పాటు సూర్యాపేట… ఖమ్మంతో పాటు భద్రాచలం లేదా కొత్త‌గూడెంలు జిల్లా కేంద్రాలు కానున్నాయి. ఆదిలాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లా…క‌రీంన‌గ‌ర్‌తో పాటు జ‌గిత్యాల జిల్లాల ఏర్పాటు కూడా మొద‌టి విడుత‌లోనే జ‌రిగే అవ‌కాశాలున్నాయి.వరంగల్ జిల్లాలో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి జిల్లాలు…నిజామాబాద్‌లో కామారెడ్డి జిల్లా ఏర్పాటు మాత్రం రెండో విడ‌త‌లో జ‌రిగే అవ‌కాశాలున్నాయి.

ఒకవైపు జిల్లాల ఏర్పాటుపై దృష్టిపెడుతూనే…మరోవైపు డివిజన్లు, మండల కేంద్రాల ఏర్పాటును కూడా చేయనున్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలను సీసీఎల్ఏ కు పంపింది సర్కారు. దీంతో కొత్త జిల్లాలు, డివిజన్, మండల కేంద్రాలు ఒకేసారి ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతమున్న పదిజిల్లాలో 38 రెవెన్యూ డివిజన్లు 455 మండలాలున్నాయి. పెరుగుతోన్న జిల్లాలతో కొత్తగా మరో 60 నుంచి 80 మండలాలు ఏర్పడనున్నాయి.