మళ్లీ తెరపైకి ఆల్మట్టి వివాదం !


ఆల్మట్టి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆల్మట్టి ఎత్తుని పెంచబోతున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆల్మట్టి ఎత్తుపై బీజేపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి డీకే శివకుమార్ జవాబిచ్చారు. ప్రస్తుతం 519.60 మీటర్లు ఎత్తు ఉన్న ఆల్మట్టి ని 524.256 మీటర్లకు పెంచుతున్నట్టు మంత్రి తెలిపారు. దీంతో.. కర్ణాటక, ఉమ్మడి ఏపీ మధ్య ఎప్పటి నుండో నానుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

ఈ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగనుంది. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణలోని జూరాల తో పాటుగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరదనీరు చేరే శాతం తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. దీనిపై తెలుగు రాష్ట్రాలు మరోసారి కోర్టుకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.