ప్రపంచం మెచ్చే రీతిలో అమరావతి భవనాల ఆకృతి

amaravathi-Nirmanamరాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలకు సంబంధించిన ఆకృతిలో అవసరమైన మార్పులు చేసి తుది రూపు తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సూచించారు. సోమవారం ఉదయం తన అధికార నివాసం నుంచి ముఖ్యమంత్రి రాజధాని నగర రూపశిల్పుల సలహా సంఘం (కేపిటల్ సిటీ ఆర్కిటెక్చర్ అడ్వయిజరీ కమిటీ)తో దృశ్య శ్రవణ సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతి నగరంలో ప్రభుత్వ భవనాల సముదాయం ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని, అందుకు తగిన విధంగా ఆకృతిని రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సలహా సంఘాన్ని కోరారు.

ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా అమరావతిని నిలిపేందుకు ఇక్కడ నిర్మించబోయే భవన సముదాయాల నిర్మాణ శైలి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభించాలి, ఎంత సమయంలో పూర్తిచేయాలనే అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. తుది ఆకృతి రూపశిల్పిగా వున్న మాకీ అసోసియేట్స్ సంస్థ ఇచ్చిన ఆకృతిని మరింత మెరుగుపరచాలని ముఖ్యమంత్రి చెప్పారు. సమీక్షలో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి శ్రీ పి. నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్య ప్రకాశ్ టక్కర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీ నాగులాపల్లి శ్రీకాంత్, రాజధాని కమిటీ సభ్యులు పాల్గొన్నారు.