‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు

Chandrababu-master-planఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ఆదర్శంగా, ఉత్తమ నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమకు తోడ్పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఛాంబర్‌లో తనతో భేటీ అయిన ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ బృందాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కారాల్లో మిగిలిన రాష్ట్రాలకు ఏపీ మార్గదర్శనం చేసేలా సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు.

‘మేం సమ్మళిత వృద్ధిని సాధించాలని, ప్రజానీకంలో సంతృప్తి శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో రెండంకెల వృద్ధిని సాధించటానికి మేం సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కారాలను ఉపయోగించుకోదలిచాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అమెజాన్ ప్రతినిధి బృందంతో చెప్పారు.

‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ ప్రతినిధి బృందం మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ మూర్ మాట్లాడుతూ ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ ప్రత్యేకతలను వివరించారు. అత్యంత వేగంగా, సమర్ధంగా కంప్యూటింగ్ సేవలు అందించే సత్తా తమ సంస్థకు ఉందన్నారు. తమ సంస్థకు ప్రపంచంలో 190 దేశాలలో పది లక్షలమంది వినియోగదారులున్నారని వివరించారు. ప్రస్తుతం వేయి ప్రభుత్వ సంస్థలు ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ సేవలను పొందుతున్నాయని తెలిపారు.

విశ్వవ్యాప్తంగా అంకుర సంస్థలు స్థాపించటానికి వాణిజ్య,వ్యాపారవేత్తలు ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ ను విశ్వసనీయమైనదిగా భావిస్తున్నారని మూర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ‌లో అంకుర సంస్థలను ప్రోత్సహించటానికి తాము రాష్ట్ర ప్రభుత్వానికి క్రియాశీలక సహకారం అందిస్తామని తెలిపారు. ‘మీ విజన్ అమలుకు తోడ్పాటు అందించటానికి, ప్రయోగాత్మకంగా పని చేసేందుకు మాకు ఇదొక సదవకాశం’ అని మూర్ అన్నారు.

ముఖ్యమంత్రి స్పందిస్తూ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తే చేకూరే ప్రయోజనాలను వివరించారు. తగిన ప్రతిపాదనలతో వస్తే కలసి పనిచేయటానికి సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ అంతర్జాతీయ కార్యనిర్వాహకులతో భేటీ అయ్యేందుకు అమెరికా రావాల్సిందిగా డైరెక్టర్ మూర్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు.

‘అమెజాన్ వెబ్ సర్వీసెస్’ పబ్లిక్ పాలసీ విభాగ అధిపతి రోజర్ సోమర్ విల్లే, రీజినల్ మేనేజర్ ఆశిష్ బూబ్, రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు జేఏ చౌదరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.