పార్లమెంటులో ఏపీ సభ్యుల హంగామా

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు అంటూ ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చెందిన టీడీపీ మరియు వైకాపా ఎంపీలు తమ అసమ్మతిని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. కొత్త రాష్ట్రం అయిన ఏపీని ఆదుకోవాల్సిన ధర్మం కేంద్రంకు ఉందని, అలా కాదని, ఏపీకి కనీసం నిధులు కేటాయించకుండా, రాజధాని కోసం ఆర్ధిక సాయం చేయకుండా ఏపీకి మొండి చేయి చూపించారు అంటూ టీడీపీ ఎంపీలు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.

నేడు లోక్‌సభ మరియు రాజ్యసభలో కూడా ఏపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో తమ అసమ్మతిని తెలుపుతూ సభ కార్యక్రమాలను అడ్డుకున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు, నినాదాల మద్య సభా కార్యక్రమాలను స్పీకర్‌ నిర్వహిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ఎంపీలు చేస్తున్న హడావుడితో ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందని సామాన్య ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.