ఏపీ వ్యవసాయశాఖకు అంతర్జాతీయ పురస్కారం

ap-agriculture-Departmentఅంధ్రప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఏపీ వ్యవసాయశాఖ చేపట్టిన ఇ-ప్రాజెక్టుకు ‘వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ’ (డబ్ల్యూఎస్ఐఎస్) పురస్కారం లభించింది. అన్ని ప్రభుత్వశాఖలు, కార్యక్రమాలు, సేవలలో డిజిటలైజేషన్ ప్రక్రియను శరవేగంతో పూర్తిచేసుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్ని అందిస్తూ డబ్ల్యూఎస్ఐఎస్ బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ సొసైటీ వరల్డ్ సమ్మిట్ సందర్భంగా ఎంపిక చేసిన ఇ-అగ్రికల్చర్ కేటగిరిలో ఈ పురస్కారం మన సొంతమైంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) సెక్రటరీ జనరల్ హోలిన్ జావో జెనీవాలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంక్షిప్త సమాచారం(ఎస్ఎమ్ఎస్) రూపంలో రైతాంగానికి చేరవేస్తున్నందుకు గాను రాష్ట్ర వ్యవసాయశాఖకు ఈ గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని ద సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) ఇ-అగ్రికల్చర్ ప్రాజెక్టుని అభివృద్ధి చేసి తొలుత ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో చేపట్టింది.

దీన్ని జాతీయస్థాయిలో విస్తరించే ఆలోచనలో సీడాక్ వ్యూహరచన సిద్ధం చేసినట్టు డబ్ల్యూఎస్ఐఎస్ పేర్కొంది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ స్థాయి ఐసీటీ సంస్థలు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి అమలుచేస్తున్న ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టులకు ప్రపంచ గుర్తింపునిచ్చి ప్రోత్సహించే ఉద్దేశంతో ఇటువంటి పురస్కారాలను అందిస్తున్నట్టు డబ్ల్యూఎస్ఐఎస్ తెలియజేసింది. అంతర్జాతీయ సహకారం మొదలు సమాచార విలువలు వరకు వివిధ అంశాలలో మొత్తం 18 పురస్కారాలను అందిస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఇ-అగ్రికల్చర్ కేటగిరిలో భారతదేశం తరుపున ఎంపికైన ప్రాజెక్టు మన రాష్ట్రానిదే కావడం విశేషం. వాతావరణంలో వచ్చే సూక్ష్మస్థాయి మార్పులను కూడా పసిగట్టి ఎప్పటికప్పుడు వైర్‌లెస్ సెన్సార్ నెట్ వర్క్స్ (డబ్లుఎస్ఎన్) ద్వారా క్షేత్రస్థాయికి చేరవేసే ఈ ప్రాజెక్టును ‘హరితప్రియ’ పేరుతో వ్యవసాయశాఖ ఆరంభించింది. పంట కాలువల నీటి విడుదలకు సంబంధించిన సమాచారమే కాకుండా పంటలకు పట్టే చీడపీడలు, ఇతర సాగు సమస్యలను ఎప్పటికప్పుడు తెలియచేసి, నిపుణులైన వ్యవసాయశాస్త్రవేత్తల ద్వారా రైతులకు విలువైన సలహాలను అందించడమే ఇ ప్రాజెక్టు ఉద్దేశ్యమని డబ్ల్యూఎస్ఐఎస్ సెక్రటరీ జనరల్ హోలిన్ తెలిపారు. స్థానిక రైతులకు సౌలభ్యంగా వుండేవిధంగా తెలుగులో ఎస్ఎమ్ఎస్‌లు పంపుతుండటం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో విశేషం.