పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ ముందడుగు

AP-Powerపునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే 24X7 నిరంతర విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ఘనత సాధించేందుకు అంకురార్పణ జరిగింది. పవన,సౌర, విండ్, సోలార్ హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తిలో 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టుల ఏర్పాటుకు సుజ్లాన్ (suzlon) ఎనర్జీ, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ కంపెనీలతో ఎంఓయూ చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహనా ఒప్పందంపై ఏపీ ప్రభుత్వ ప్రతినిధి, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ ప్రతినిధులు సంతకాలు చేశారు.

ఈ ఎంఓయూ ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఆ విద్యుత్ సంస్థలు .. పవన, సౌర, హైబ్రిడ్ విద్యుత్ రంగాల్లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పాల్సి ఉంది. అనంతపురం, నెల్లూరు జిల్లాలలో ఏడాదికి 1000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన విండ్ టర్బయిన్ జెనరేటర్స్ ఉత్పత్తికి సమీకృత ఉత్పత్తి సదుపాయాలు కల్పిస్తారు. ఎంఓయూ కుదుర్చుకున్న శుక్రవారం నాటి నుంచి 30 రోజుల్లోగా ప్రాజెక్టు అమలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయాలని నిర్ణయించారు.

ఒప్పందంలో భాగంగా అనంతపురంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఈ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుతో ఎనిమిది వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాల కల్పన జరుగుతుంది. అమరావతిలో నెలకొల్పనున్న ఎనర్జీ యూనివర్శిటీకి సుజ్లాన్ కంపెనీ సహకారం అందిస్తుంది. రిన్యువబుల్ ఎనర్జీపై ఒక పీఠం ఏర్పాటు చేస్తుంది. ఈ విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయటం ప్రారంభించిన తర్వాత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి 4000 మెగావాట్ల పర్యావరణ హిత విద్యుత్తు ( గ్రీన్ పవర్) లభిస్తుంది. ఇందువల్ల 64.47 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా నిరోధించవచ్చు.

విండ్,సోలార్ మ్యాన్యుఫాక్చరింగ్ సదుపాయాలకోసం రూ.500 కోట్లు. 4వేల మెగావాట్ల విండ్ పవర్, విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల అమలుకు 28వేల కోట్ల పెట్టుబడులు పెడతారని అంచనా.

ఎంఓయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 2021 నాటికి పునరుత్పాదక (renewable) విద్యుత్ సామర్ధ్యం లక్షా 75 వేల మెగావాట్లు సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ లక్ష్యం 18వేల మెగావాట్లని వివరించారు. ఇది మొత్తం కేంద్ర లక్ష్యంలో 10% గా ఉంటుందని చెప్పారు.

పునరుత్పాదక విద్యుత్ లో ఆంధ్రప్రదేశ్ 2021-22 నాటికి 18 వేల మెగావాట్లు ఉత్పత్తి చేస్తే ఏడాదికి 252 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను (corbon emissions) తగ్గించినట్లవుతుందని, తద్వారా పర్యావరణానికి ఎంతో మేలుచేస్తామని తెలిపారు. పవన, విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు నెడ్ క్యాప్ ప్రణాళికాబద్ధ విధానాలతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే వేగంతో పయనిస్తే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రిన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా ఏర్పడుతుందన్న విషయంలో తనకెంతమాత్రం సందేహం లేదని అన్నారు. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల లోటు (10.6%)తో ఉండేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, అందరికీ విద్యుత్ కింద, 24×7 నిరంతర విద్యుత్ సరఫరా పథకం అమలు చేశామని, గత ఏడాది డిసెంబర్ నాటికే విద్యుత్ లోటును 0% స్థాయికి తీసుకొచ్చామని, ఇది తాము సాధించిన విజయమని వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. ఒక్కనిమిషం కూడా విద్యుత్ అంతరాయం లేని వ్యవస్థ నెలకొల్పటం తమ లక్ష్యమన్నారు.

అవగాహనా ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ జైన్, సుజ్లాన్ కంపెనీ చైర్మన్ తులసి తాంతి (Tulsi Tanti), యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ ఎండీ శ్రీ. కె. రవికుమార్ రెడ్డి సంతకాలు చేశారు. ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి డా.పివి రమేశ్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ.జి సాయిప్రసాద్, కార్యక్రమంలో నెడ్‌క్యాప్ వైస్‌చైర్మన్,ఎండీ(విసిఎండీ) శ్రీ ఎం. కమలాకర్ బాబు, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు శ్రీ సిహెచ్, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.