మోర్బీకి దీటుగా ఏపీ

ceramic-city-ap
గుజరాత్‌లోని మోర్బీకి దీటుగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సిరామిక్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. కృష్ణా, గోదావరి జిల్లాలలో ఏదైనా అనువైన ప్రదేశంలో 3 వేల ఎకరాల విస్తీర్ణంలో సిరామిక్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు.

మోర్బీ నుంచి వచ్చిన సిరామిక్ పారిశ్రామికవేత్తలతో శుక్రవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశంపై కూలంకుషంగా చర్చించారు. గుజరాత్‌లోని శానిటరీ వేర్, సిరామిక్ టైల్స్ తయారీదారులు వచ్చి ఇక్కడ నిర్భయంగా పరిశ్రమలు పెట్టుకోవచ్చునని ప్రతిపాదించారు. గుజరాత్‌కు మించి ఎన్నో సానుకూలతలు వున్న ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, పుష్కలంగా లభించే గ్యాస్, నీరు, భూమి, వ్యాపార సరళీకరణ, విస్తారంగా వున్న ఖనిజ సంపద, ప్రభావవంతమైన మానవ వనరులతో మోర్బీని మించిన సిరామిక్ టౌన్‌షిప్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. మరో రెండునెలల్లోనే అనువైన ప్రదేశాన్ని ఎంపికచేసి సిరామిక్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌కు భూమిపూజ చేస్తామని తెలిపారు. గ్యాస్ సరఫరా తమకు ప్రధాన సమస్యగా వున్నదని సిరామిక్ ఉత్పత్తిదారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, కాకినాడలో ఎల్ఎన్‌జీ గ్యాస్ టెర్మినల్ ఏర్పాటవుతోందని, అలాగే, గ్యాస్ పైప్‌లైన్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్న రాష్ట్రం ఏపీయేనని తెలిపారు.

రూ.30 వేల కోట్ల సిరామిక్ మార్కెట్, రూ.4 వేల కోట్ల శానిటరీ వేర్ మార్కెట్ కలిగివున్న ఈ పరిశ్రమకు రానున్నకాలంలో ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద కూడలిగా మారనున్నదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి కేంద్రస్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయాసియా దేశాలకు ముఖద్వారం కాబోతోందని గుర్తుచేశారు. మిగిలిన ఏ రంగంలోనైనా అనిశ్చితి వుంటుందని, గృహ నిర్మాణ రంగం అలా కాకుండా నిరంతర క్రియాశీలకంగా వుంటుందని, అదే సిరామిక్ పరిశ్రమకు వెన్నుదన్ను అవుతుందని అన్నారు. నగరీకరణ పెరుగుతుండటం, ప్రభుత్వం పెద్దఎత్తున స్మార్ట్ సిటీల నిర్మాణానికి పూనుకోవడం, గృహ నిర్మాణంలో టైల్స్ పట్ల వినియోగదారుల్లో అంతకంతకూ మోజు పెరుగుతుండటం ఈ పరిశ్రమకు చేయూతగా మారనున్నదని చెప్పారు. దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, కువైట్, శ్రీలంక, సింగపూర్ వంటి దేశాలకు పెద్దఎత్తున సాగుతున్న ఎగుమతులు సిరామిక్ రంగానికి అదనపు అవకాశాలని వివరించారు.

ఈ రంగంలో దక్షిణ భారతదేశానికి అతి పెద్ద మార్కెట్‌గా ఎదగగల అవకాశం ఏపీకే వున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి-దిగుమతులకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వున్న ఓడరేవులు ముఖ్యపాత్ర వహిస్తాయని అన్నారు. సిరామిక్ తయారీకి అవసరమైన మట్టి, సున్నపురాయి, క్వార్ట్జ్, సిలికాన్ శాండ్ నిల్వలు ఏపీలో సమృద్ధిగా వుండటం ఇక్కడ నెలకొల్పబోయే సిరామిక్ పరిశ్రమలకు అనుకూల అంశాలని వివరించారు. ప్రభుత్వం నుంచి తగినన్ని ప్రోత్సాహకాలు, అవసరమైన అనుమతులు త్వరితగతిన అందజేస్తామని చెప్పారు.
గోదావరి, కృష్ణా జిల్లాలను సిరామిక్ హబ్‌గా మార్చేందుకు దోహదం చేసే సిరామిక్ పాలసీని తీసుకొస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. మోర్బీలో ఏపీకి చెందిన ఎంతోమంది పెట్టుబడిదారులు పరిశ్రమలు స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తుండటం తమకు గర్వకారణమని, వారు సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని కోరారు.

ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై మోర్బీ పారిశ్రామికవేత్తలు హర్షాన్ని తెలియపరచి వేల కోట్ల పెట్టుబడులతో ఏపీకి తరలిరావడానికి ఉత్సుకత ప్రదర్శించారు. మరో రెండునెలల్లో ఎంపిక చేసిన అన్ని అనుకూలతలు వున్న ప్రదేశంలో భూమిపూజ జరుపుకుందామని సీయం ప్రకటించారు. ఈ సమావేశంలో గనుల శాఖ మంత్రి పీతల సుజాత, గనుల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.