రాజీనామాకు సిద్దంగా ఉండమ్మన్న బాబు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ 2018లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నాయకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ విజ్ఞప్తులు ఏమాత్రం పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని, కొత్త రాష్ట్రం అయిన ఏపీకి ఏమాత్రం ప్రత్యేక కేటాయింపులు లేక పోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్థాపంకు గురైనట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ నాయకులతో ఇష్టం లేకుండానే కాపురం నెట్టుకు వస్తున్న టీడీపీ బడ్జెట్‌ తర్వాత ఇరు వైపుల ఇష్టం లేని సంసారం వృదా అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే బీజేపీ వద్దనుకుంటే నమస్కారం పెట్టి తప్పుకుంటాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు తాజాగా బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో జరిగిన అన్యాయంతో మరో అడుగు ముందుకు వెయ్య బోతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయంకు నిరసనగా కేంద్రం మంత్రి వర్గంలో ఉన్న టీడీపీ మంత్రులు రాజీనామాకు సిద్దం కావాలని, రెండు మూడు రోజుల్లో రాజీనామాలు చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు సందేశం పంపినట్లుగా తెలుస్తోంది. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రం వద్ద బాహాటంగానే మాట్లాడాలని మంత్రులు మరియు ఎంపీలకు సీఎం బాబు సలహా ఇవ్వడం జరిగింది. బాబు సలహా మేరకు సుజనా చౌదరి కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.