ఆగస్టులో సాగరతీరంలో మరో అంతర్జాతీయ వేడుక

Vizag_beachవినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు రానున్న రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్‌లో నాలేడ్జ్ ఎకానమీని ఎలాగైతే ప్రోత్సహించామో అదేరీతిలో ఇన్నోవేషన్లు, ఇంక్యూబేషన్లకు నవ్యాంధ్రప్రదేశ్‌ను చిరునామాగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్రంలో వుండే యువతీ యువకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న మరో 50 లక్షల మంది తెలుగువారు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందుతోందని ఆయన తెలిపారు.

మంగళవారం సాయంత్రం రాష్ట్ర శాసనసభ మీటింగు హాలులో నాస్కామ్‌తో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకున్న సందర్భంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 10 వేల అంకుర సంస్థలను ఏర్పాటు చేయాలని నాస్కామ్ తలపెట్టింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖ నుంచి ఆరంభిస్తోంది. తొలిదశ 10 కె ఇంక్యుబేషన్స్ కార్యక్రమంలో భాగంగా విశాఖనగరంలో ఒక వేర్ హౌస్ ఆరంభించనున్నారు. ఔత్సాహికులకు అంకుర సంస్థల ఏర్పాటుకు అవసరమైన సాధనసంపత్తిని, సాంకేతిక సహాయ సహకారాలను ఈ వేర్ హౌస్ నుంచి అందిస్తారు. నాస్కామ్‌ 10కె స్టార్టప్స్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమలు కావడం మనకు గర్వకారణమని అన్నారు. రెండుమాసాల్లో విశాఖలో నాస్కామ్ 10 కే ఇంక్యుబేషన్స్ వేర్ హౌస్ సిద్ధంగా వుంటుందని సీయం ఈ సందర్భంగా చెప్పారు. స్థానికంగా ఎంటర్‌ప్రెన్యూర్లను తయారుచేయడమే 10కె స్టార్టప్స్ కార్యక్రమ లక్ష్యమని నాస్కామ్ అధ్యక్షుడు శ్రీ ఆర్ చంద్రశేఖర్ తొలుత ముఖ్యమంత్రికి వివరించారు. దేశవ్యాప్తంగా 10వేల స్టార్టప్స్ ఏర్పాటును ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు.

ఐటీరంగంలో స్వయంగా ఎదగాలనుకునేవాళ్లకు అన్నివిధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమీంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే యువతీయువకుల్ని కళాశాల స్థాయి నుంచి ప్రోత్సహిస్తామని తెలిపారు. వారు భవిష్యత్తులో సొంత కాళ్లపై నిలబడేలా ఆర్థికంగా వెన్నుదన్నుగా వుంటామని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా పెట్టుబడులు సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తామని అన్నారు. అవసరమైతే వెంచర్ కేపిటలిస్టులతో సమన్వయం చేసి సొంతంగా కంపెనీ ఏర్పాటుచేసుకునే స్థాయికి తీసుకువెళతామని తెలిపారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతదేశం నుంచి వస్తుంటే, అలా వచ్చిన ప్రతి ఐదుగురిలో ఇద్దరు తెలుగువారేనని అన్నారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్, గణితంలో మన తెలుగువారికి వున్న మేధా సంపత్తులే ఇవాళ వారిని అత్యున్నతస్థాయికి ఎదిగేలా చేశాయని చెప్పారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలో సహకారంతో విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా నైపుణ్యాభివృద్ధిలో మన విద్యార్థుల్ని సుశిక్షితుల్ని చేసే కార్యక్రమాన్ని ఇటీవలే ఆరంభించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

విశాఖ తీరం అంతటి ఆహ్లాదభరిత నగరం దేశంలో మరొకటి లేదని, ఇక్కడే శాశ్వత చిరునామా చేసుకుని పనిచేస్తే 10వేల అంకుర సంస్థల ఏర్పాటు లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చునని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా నాస్కామ్ అధ్యక్షునికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌పై మరింత దృష్టి పెట్టి ఇక్కడి యువతను ప్రోత్సహించి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఆయన కోరారు. రానున్న రెండునెలల్లో రాష్ట్రంలో బ్యాండ్ విడ్త్ విప్లవాన్ని తీసుకొస్తున్నామని, రూ.150లకే కేబుల్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా 10-15 ఎంబీపీయస్ స్పీడుతో ఇంటర్నెట్ అందించి దానికి అదనంగా టెలిఫోన్ మాట్లాడుకునే సౌకర్యం కూడా కల్సిస్తున్నామని చెప్పారు. ఈనెల17న ఈ కార్యక్రమాన్ని విశాఖనుంచి ఆరంభిస్తున్నామన్నారు.

ఆగస్టులో విశాఖలో ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్స్ సమ్మిట్

స్టార్టప్స్ ప్రోత్సాహం కోసం ఔత్సాహికుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం సృష్టించాలని, ముందు వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టి తరువాత వారి మేధస్సుకు పరిక్ష పెట్టేలా పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఐటీ అధికారులకు సూచించారు. తుది ఎంపిక పూర్తిచేసి ఈ పోటీలలో చివరిగా నిలిచే వారితో వచ్చే ఆగస్టులో విశాఖలో భారీఎత్తున ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్స్ సమ్మట్ నిర్వహించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిదాయకమైన విజయగాధలు వినిపించి మన యువతలో ఉత్తేజం నింపాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యార్థులు ఎవరైనా వినూత్న ఆలోచనలు, విలక్షణమైన ప్రయోగాలతో ముందుకొస్తే వారికి అవసరమైన ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పారు.