రాజకీయాల్లోకి అశోక్ బాబు.. ?

ashok-babuసమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఊరువాడ విస్తరింపజేసిన ఘనత ఆయనది.. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా.. అసలు రాజకీయ నాయకులను సమైక్య ఉద్యమ కార్యక్రమాల్లో దయచేసి పాల్గొనవద్దని.. తాము స్వతంత్రంగా పోరాడతామని.. రాజకీయ పులుము లేకుండా ఉద్యమపంథాని కొనసాగిస్తామని చెప్పిన ఉద్యమనేతనే.. ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు. నిన్న కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ’సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో అశోక్ బాబు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను ప్రక్కను పెట్టి తన రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించడం విశేషం.

గ్రామాల్లోకి వెళ్లినప్పుడు రాజకీయాల్లోకి రావాలని ప్రజలనుంచి ఒత్తిడి వస్తోందని … పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానేమోనని అశోక్‌ బాబు అన్నారు. సీమాంధ్ర ప్రజల కోరికను మన్నించి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని పరోక్షంగా ప్రకటించారు. అంతేకాదు… రాష్ట్రంలోని 7కోట్ల మంది ప్రజలు అశోక్ బాబు అధ్యక్షత వహించే ఏపీ ఎన్జోవోల వైపు వున్నారని స్పష్టం చేశారు. అయితే, దీని వెనక ప్రజలు తన వెనక వున్నారని చెప్పడమే ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. ’సింహం నిద్రపోతుంది కదా.. ఏమీ చేయలేదని పిచ్చి పనులకు పోతే.. ఒకే పంజాతో చంపేస్తుందని’ ప్రస్తుతం సమైక్య ఉద్యమం కూడా ఇలాగే వుందని పేర్కొన్నారు.

మొత్తంమ్మీద ఏపీఎన్జీవోల పోరాటాన్నే అశోక్ బాబు తన రాజకీయ రంగ ప్రవేశానికి ముందు రిహాసల్స్ గా ఉపయోగించుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి టీ-జేఏసీకి సారథ్యం వహిస్తున్న కోదండరాం కూడా ఏనాడు రాజకీయ ప్రస్తానం గురించి ఇంత డైరెక్టగా ఎప్పుడు స్పందించలేదు. మరీ.. అశోక్ బాబుకు ఎందుకు వచ్చిందో ఇంత తొందర.. !