ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి బీకే హరిప్రసాద్‌

రేపు (ఆగస్టు9) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ గా కొత్తవారిని ఎన్నుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ నామినేషన్ వేశారు. తాజాగా, ఈ పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపీ బీకే హరిప్రసాద్ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఎన్డీయేను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే అభిప్రాయానికి వచ్చాయి. ఐతే, డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ సుముఖత చూపించలేదు. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌కు అప్పగించడంతో.. ఆ పార్టీ హరిప్రసాద్‌ పేరును ఖరారుచేసింది. హరిప్రసాద్‌ ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.