స్టార్‌బక్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. ఉద్యోగినికి రూ.210కోట్లు చెల్లించాల్సిందే..


శ్వేత జాతీయురాలిని ఉద్యోగం నుంచి తొలగించిందనందుకు ప్రముఖ అంతర్జాతీయ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఓ ఉద్యోగినిని సంస్థ నుంచి తొలగించినందుకు 25.6 మిలియన్ల డాలర్లు అంటే రూ.201 కోట్లు చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ ఆదేశించింది. 2018లో ఓ ఉద్యోగిని వేసిన కేసులో ఇటీవల ఫెడరల్ జ్యూరీ ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యూజెర్సీలోని ఫిలడెల్ఫియా బ్రాంచ్‌లో స్టార్‌బక్స్‌ స్టోర్‌లో శ్వేతజాతీయురాలైన షానన్‌ ఫిలిప్స్ 13 సంవత్సరాలుగా ప్రాంతీయ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది.

ఈక్రమంలో 2018లో స్టార్‌బక్స్‌ స్టోర్‌కు ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. వారి అక్కడి వాష్ రూమ్ వాడుకోవాలని అడిగారు. కస్టమర్లకు అనుమతి ఉంటుంది గానీ.. మీరు స్టోర్‌లో ఏమీ కొనుగోలు చేయలేదు. కాబట్టి వాష్ రూమ్ ఉపయోగించుకోవటం కుదరదు అని తెలిపారు షానన్. అలా స్టోర్ సిబ్బందితో గొడవకు దిగారు. స్టోర్‌ సిబ్బంది పోలీసులకు ఫోన్‌ చేయగా నల్లజాతీయులను అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్‌ దృశ్యాలు వైరల్ కావడంతో.. నల్లజాతీయులపై వివక్ష చూపిస్తున్నారు అంటూ నిరసనకు దారితీసింది. నిరసనలు తీవ్రస్థాయికి వెళ్లాయి. దీంతో రీజినల్‌ మేనేజర్‌ అయిన షానన్‌ ఫిలిప్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ మేనేజర్‌ను మాత్రం తొలగించలేదు. ఎందుకంటే రీజినల్‌ మేనేజర్‌ షానన్ శ్వేత జాతీయురాలు. మేనేజర్‌ నల్ల జాతీయుడు కావడం గమనార్హం. శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష చూపారంటూ 2019లో స్టార్‌బక్స్‌పై షానన్‌ దావా వేశారు. అలా ఇన్నాళ్లుగా కేసు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఫెడరల్‌ జ్యూరీ.. స్టార్‌బక్స్‌ సంస్థ సదరు ఉద్యోగినిపై జాతి ఆధారంగా వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ 25.6 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది.