ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం – చంద్రబాబు

Babu-Brదళిత, గిరిజనులు సమాజంలోని మిగిలిన వర్గాలతో సమానంగా ఎదిగేలా, అంతరాలు తొలిగిపోయేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సబ్‌ప్లాన్‌ నిధులను సమర్ధవతంగా వినియోగించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 60 శాతం అధికంగా మొత్తం రూ. 8724 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కి మొత్తం రూ. 3,099 కోట్లు కేటాయించామని అన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురష్కరించుకుని ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి మరింతగా కృషి జరపాలని, వచ్చే ఆర్ధిక సంవత్సరానికి ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో దళిత, గిరిజనుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీల తలసరి ఆదాయం పెంచగలిగితే ప్రభుత్వం విజయం సాదించినట్టేనని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలు సుస్థిర ఆర్ధిక అభివృద్ధి సాధించేలా చేయడంతో పాటు, దళిత వాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే వారిలో అక్షరాస్యత పెంపొందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ సంకల్పంగా ముఖ్యమంత్రి వివరించారు. ఉత్తీర్ణత శాతం కూడా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా వుండాలని మార్గదర్శనం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లలో మరిన్ని వసతులు కల్పించి, సీట్ల సంఖ్య పెంచడం ద్వారా ఎక్కువ మందికి నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఈ సందర్భంగా ఆదేశించిన సీఎం, అందుకు అనుగుణంగా ప్రతి విద్యార్ధికి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలని స్పష్టం చేశారు. మహరాష్ట్రలో టాటా ట్రస్ట్, అక్షయపాత్ర సంయుక్తంగా చేపట్టినట్టు పోలవరం ప్రాంతాన్ని మోడల్‌గా తీసుకుని కామన్ కిచెన్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల మెరుగ్గా నిర్వహించేందుకు పీపీపీ పద్ధతి మేలైనదిగా సీఎం అభిప్రాయపడ్డారు.

చంద్రన్న సంక్షేమ పాలన కింద 83,694 మంది లబ్దిదారులకు రూ.591.24 కోట్ల విలువైన వస్తువులు పంపిణీ చేయగా, చంద్రన్న రుణమేళా కింద 2015-16లో రూ.356.46 కోట్లతో 28,539 మందికి సాయమందించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ కింద 15 దేశాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు విద్యను అభ్యసించేలా ఏడాదికి రూ. 6 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తున్నట్టు చెప్పారు. ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’లో భాగంగా 350 మందికి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 186 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను 116 రెసిడెన్షియల్ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని తద్వారా 2,447 మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. ‘చంద్రన్న దళిత బాట’ పేరుతో రూ. 1110 కోట్లతో 1648 కొత్త రోడ్లను నిర్మించినట్టు చెప్పారు. 10 వేల మంది నిరుద్యోగ యువతకు ‘చంద్రన్న చేయూత’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించే బాధ్యతను తీసుకున్నట్టు వెల్లడించారు.

గిరిజనుల సంక్షేమంపైనా ప్రత్యేకంగా సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. గిరిజన గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, గిరిజన కుటుంబాలు అత్యధిక ఆదాయం ఆర్జించేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులతో అన్నారు. గిరిజన ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సి వుందన్నారు. ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించిన మొత్తం 13 గిరిజన ఉత్పత్తులు ఆన్‌లైన్ మార్కెట్‌లో సహా వాల్‌మార్ట్ వంటి ఔట్‌లెట్‌లలో లభించేలా చూడాలని జీసీసీ అధికారులకు సీఎం సూచించారు. కాఫీ, పసుపు, జీడిమామిడితో సహా ఏజెన్సీలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని అన్నారు. అటు ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’ కింద 98 గిరిజన విద్యార్ధులకు సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చినట్టుగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లో ఖాళీగా వున్న 285 ఉపాధ్యాయ బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. 28 యూత్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా ప్రస్తుతం 760 మంది యువతకు శిక్షణ ఇస్తున్నట్టు, ఇంకా 13 జిల్లా కేంద్రాల్లో గిరిజన భవన్‌లను రూ.1.35 కోట్లతో నిర్మిస్తున్నట్టు వివరించారు. రూ.12 కోట్లతో జీసీసీ కార్యాలయ భవనం, రూ.20 కోట్లతో విశాఖపట్టణంలో ట్రైబల్ మ్యూజియం నిర్మిస్తున్నట్టు చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలకు అందించే అన్ని పథకాలను తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి వుందని సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కులం, మతం, ప్రాంతాలుగా సమాజం విడిపోతే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని వివాదాలు, విభేదాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు అభివృద్ధి గురించి ఆలోచించాల్సి వుందని తెలిపారు. మంత్రులు రావెల కిషోర్ బాబు, పీతల సుజాత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, ఎస్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ శామ్యూల్ ఆనంద్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ పద్మ, సీఎంవో సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీడీఏల పీవోలు సమీక్షలో పాల్గొన్నారు.