చంద్రన్న భీమా పధకం….ఎవరికీ ???

Chadranna-Bhima-Padhakam ఆంధ్రప్రదేశ్ లో కోటిన్నర మంది అసంఘటిత కార్మికుల భద్రతకు రూ. 5 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసే ‘చంద్రన్న బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. ఎ-1 కన్వెన్షన్ హాలులో రాష్ట్ర ప్రభుత్వం మేడే ఉత్సవాలను అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ‘చంద్రన్నబీమా’ పథకం ఫైలుపై సంతకం చేశారు. దేశంలో తొలిసారిగా మూడో వంతు ప్రజలకు ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని సభలో వివరించారు. మూడు నెలల్లో నమోదు కార్యక్రమాలు పూర్తవుతాయని, ఆగస్టు పదిహనో తేదీ నుంచి ‘చంద్రన్న బీమా’పథకాన్ని అమలులోకి తెస్తామని తెలిపారు. ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే ముందుగా అతని భార్యకే బీమా సొమ్ము వస్తుందని, ఆమె లేని పక్షంలో పిల్లలకు ఇస్తామని, ఇందుకోసం చట్టాన్ని మార్చి మరింత స్పష్టతనిస్తామని చంద్రబాబు వివరించారు.

కుటుంబ సభ్యులకంటే కార్మికులే విశ్వసనీయంగా ఉంటారని, యజమానులు కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని సీఎం అన్నారు. కార్మికులు కూడా పరిశ్రమ శ్రేయస్సుకు, యజమాని క్షేమానికి, తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు పాటుపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కార్మికులు, కర్షకుల శ్రమలేనిదే ఈ ప్రపంచం లేదని, వీళ్లు కష్టపడితే తప్ప ఆదాయం వచ్చే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి జరగకపోతే ఆదాయం రాదని చెప్పారు. సంపద సృష్టించాలంటే కష్టపడాలని, సంపద సృష్టి లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదని, ఆదాయం రానిపక్షంలో సంక్షేమం సాధ్యం కాదని తెలిపారు. నిరంతర అభివృద్ధితో జీవన ప్రమాణాలు పెరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ‘మీ ఇంట్లో కుటుంబ సభ్యలకంటే కూడా కార్మికులే ఎక్కువగా కష్టపడతారు’ అని యజమానులను ఉద్దేశించి అన్నారు.

‘ఏ కార్మికుడూ కూర్చున్న కొమ్మను నరుక్కోవాలని అనుకోడని, నాయకులు స్వార్ధంతో వ్యవహరిస్తే, యాజమాన్యం తప్పు చేస్తే పరిశ్రమలు మూతపడతాయి’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కార్మికుడు కుటుంబం గురించి ఎలా ఆలోచన చేస్తాడో పరిశ్రమ గురించీ అదే విధంగా ఆపేక్షగా ఉండాలని సూచించారు. పరిశ్రమల యజమానులు మారిన పరిస్థితులకు అనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా వ్యవహరించాలన్నారు. పరిశ్రమలు, కర్మాగారాలు నడిస్తేనే కార్మికులకు భవిష్యత్తు, తద్వారా రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.

‘నేను దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నాను. ఇక్కడ పరిశ్రమలు స్థాపించే వాతావరణం ఉండాలి. కార్మిక అశాంతికి తావు ఉండకూడదు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుంది’ అని చంద్రబాబు చెప్పారు.

ప్రపంచీకరణ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తోందని, పరిపాలనలో,అభివృద్ధిలో తనకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోందని చంద్రబాబు చెప్పారు. బిల్డర్స్‌కు సింగిల్ రిజిస్ట్రేషన్ తో 15 పర్మిషన్లు ఆటోమేటిగ్గా ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. వేధింపులు ఉండవన్నారు.

తక్కువ ఖర్చుతో నాణ్యంగా ఉండే ఉత్పత్తులకు గిరాకీ అధికమని, బ్రాండ్ ఇమేజీ రావటానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లలో విద్యుత్ రంగ వ్యవస్థను కుప్ప కూల్చిందని, అనేక రిశ్రమలు మూతపడ్డాయని, తాము అలా మూతపడే స్థితికి చేరిన కొన్ని పరిశ్రమలకు 2000 కోట్ల బకాయిలు చెల్లించి జీవవాయువు అందించానని చంద్రబాబు తెలిపారు.

మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రాష్ట్రమని, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాలన్నారు. పరిశ్రమల యజమానులకు వేధింపులు లేకుండా ఆన్ లైన్ తనిఖీ విధానం ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మాన్యువల్ తనిఖీలను నిషేధించామని చెప్పారు.

తనిఖీల పేరుతో వ్యాపార సంస్థలు, పరిశ్రమల యజమానులకు ఇక వేధింపులు ఉండబోవని స్పష్టం చేశారు. అవసరమైన కొన్ని తనిఖీలకు కూడా..ఆరోజు ఎక్కడ తనిఖీ చేయాలో కొద్ది సమయం ముందుగా తెలుస్తుందన్నారు. గత ఏడాది దేశంలో తొలిసారిగా గత ఏడాది ఆన్ లైన్ లో ఇంటిగ్రేటెడ్ రిజిస్టేషన్ విధానం ప్రవేశపెట్టామని, అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందే ఈ విధానం విజయవంతమైందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.