చంద్రయాన్‌ -3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేపే నింగిలోకి !


చంద్రయాన్‌ -3 ప్రయోగం కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు(జూలై 14) మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు జియో సింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌ LVM3-M4 రాకెట్‌ తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇకపోతే ఇస్రో అంచనా ప్రకారం ఆగస్ట్ 23 లేదా 24 తేదీల్లో చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ఒక అంతరిక్ష నౌక ల్యాండ్ కావడం ఇదే ప్రథమం.

ఇకపోతే ఇస్రో అభివృద్ధి చేసిన లాంచ్‌ వెహికల్స్‌లో LVM3-M4 అత్యంత శక్తివంతమైనది. ఇది భారీ పరిమాణంలో పేలోడ్‌ను అంతరిక్షంలోకి సులభంగా మోసుకెళ్లగలదు. ఇందులో రెండు ఘన ఇంధన బూస్టర్లు, ఒక ద్రవ ఇంధన కోర్‌ స్టేజ్‌తో కూడిన మూడు దశలు ఉన్నాయి. రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లడానికి ప్రాథమిక దశలో ఘన ఇంధన బూస్టర్లు దోహదపడతాయి. ఇక రాకెట్‌ చంద్రుడి కక్ష్యలోకి చేరడానికి ద్రవ ఇంధన కోర్‌ స్టేజ్‌ సాయపడుతుంది.

ఇక చంద్రయాన్ ప్రయోగంలో మూడు మాడ్యూల్స్ ప్రధానంగా పని చేస్తాయి. ఇందులో మొదటిది ప్రొఫల్షన్ మాడ్యూల్. ఇది రాకెట్ ను నింగిలోకి తీసుకెళుతుంది. రాకెట్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ తర్వాత రెండోది లాండర్ మాడ్యూల్. చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్‌ దిగగానే రోవర్‌ బయటకు వస్తుంది. ఈ ప్రయోగంలో మూడవది రోవర్. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరం ఇది. ఇక ఈ రోవర్‌ జీవితకాలం 14 రోజులు. అక్కడ ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.

ఇకపోతే 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇస్రో శాస్ట్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో అమెరికా, రష్యా, చైనా ఈ ఘనత సాధించగా, ఆ జాబితాలోకి భారత్‌ కూడా చేరుతుంది.