ఇక సులభంగా స్వల్పకాలిక రుణాలు

Chandrababu-master-plan బ్యాంకులు తక్కువ రుణాలకు డిపాజిట్లు, ష్యూరిటీలు అడిగి రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజల్ని అవస్థలకు గురిచేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఎస్.ఎల్.బిసి చైర్మన్ తో తాను ఈమేరకు మాట్లాడానని, ఆయన అంగీకరించారని ముఖ్యమంత్రి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్.ఎల్.బి.సి) సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. లక్ష నుంచి 3 లక్షల లోపు రుణాలకు డిపాజిట్లు అంటూ ఇబ్బంది పెట్టవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

ఎస్.ఎల్.బి.సి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. ముద్రాబ్యాంకు రూ10 లక్షల మేర రుణాలిస్తున్నదని, నిబంధనలు లేకుండా ఇవ్వాలన్నారు. రైతులకు ఇచ్చే రుణాల విషయంలో బ్యాంకులు షరతులు విధించవద్దని ఆయన సూచించారు. బ్యాంకులు రుణాలివ్వకపోతే అన్నదాతలు ఎలా అభివృద్ధి చెందుతారని ఆయన ప్రశ్నించారు. బ్యాంకింగ్ కన్సల్టెంట్లు లేనిచోట స్వయంసహాయక సంఘాల మహిళల సేవలను ఉపయోగించుకోవాలని, ఈ సంఘాల సభ్యుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆర్ధికంగా వారికి వెసులుబాటు కలుగుతుందని వివరించారు.

పంటసంజీవని, రెయిన్ గన్స్ కుసహకరించండి: సీఎం

రాష్ట్రంలో వచ్చే జూన్, జూలై నాటికి 10 లక్షల సేద్యపు కుంటలు తవ్వుతామని, లక్ష రెయిన్‌గన్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు బ్యాంకులు సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సీజన్ లో రోజుకు లక్ష ఎకరాలకు మొబైల్ రెయిన్ గన్స్ ద్వారా పంటతడి అందిస్తామని, ఈ రకంగా 40 లక్షల ఎకరాలకు పంటతడి అందించాలన్నది తమ లక్ష్యమని వివరించారు. బ్యాంకర్లు సహకారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
వ్యవసాయం ద్వారా రైతులకు మరింత ఆదాయం సమకూరేందుకు బిందు, సూక్షసేద్యపు పద్ధతులను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిత్యం కరవు తాండవించే రాయలసీమ సహా వెనుకబడిన జిల్లాలు ఇందువల్ల అభివృద్ధి చెందుతాయన్నారు.

అనేక రాష్ట్రాలలో పారిశ్రామికరంగంతో వ్యవసాయరంగం పోటీపడుతుందని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుగా ఉన్నాయని, మన దగ్గర ఆ పరిస్థితి సాధించాలంటే బ్యాంకుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. మన రాష్ట్రంలో సర్వీసు సెక్టారు అభివృద్ధికి అవకాశాలు పుష్కలమని, బ్యాంకర్లు సహకారం అందజేస్తే రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, రాష్ట్ర స్వరూపమే మారిపోతుందని అన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి టక్కర్, ఎస్.ఎల్..బిసి ప్రెసిడెంట్. ఆంధ్రబ్యాంకు ఎండీ, సీఈఓ సురేష్.ఎన్.పటేల్, ఆర్.బిఐ రీజినల్ డైరెక్టర్ (హైదరాబాద్) ఆర్.ఎన్.దాస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ హరీష్ జావా, ఆంధ్రబ్యాంక్ రీజినల్ జీఎం, ఎస్.ఎల్.బి.సి కన్వీనర్ ఎం. దుర్గాప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఇ. రతన్ కుమార్, బ్యాంకర్లు పాల్గొన్నారు.