అమరావతిలో కళ్లు చెదిరేలా కన్వెన్షన్ సెంటర్

convention-centre-amaravath
అమరావతిలో చేపడుతున్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను దేశంలోనే అతి పెద్ద సమావేశ మందిరంగా వుండేలా నిర్మించడానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకరించింది. అలాగే, తాము తలపెట్టిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను జర్మనీలోని హనోవర్ ఫెయిర్‌కు దీటుగా వుండేలా తీర్చిదిద్దేందుకు ఈ గ్రూపు సంసిద్ధమైంది. అంతేకాకుండా, అమరావతిలో ఏర్పాటుచేస్తున్న అమ్యూజ్‌మెంటు పార్కు కోసం అత్యుత్తమ ఆకృతులను అందించేందుకు ఈ రంగంలో పేర్గాంచిన వరల్డ్ క్లాస్ డిజైనర్లను తీసుకొస్తామని డాక్టర్ షెట్టీ ముఖ్యమంత్రికి మాటిచ్చారు.

నవ్యాంధ్రప్రదేశ్‌లో రూ.12 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకొచ్చిన అబుదాబీకి చెందిన ఈ వాణిజ్య దిగ్గజం గత మే 2న జరిగిన అవగాహన ఒప్పందం పురోగతిపై సమీక్షించేందుకు రాష్ట్రానికి వచ్చింది. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో తన కుటుంబంతో సహా కలిసిన డాక్టర్ షెట్టీ ఈ ప్రాజెక్టులపై చర్చించారు. ఏదో సాధారణ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలని తాము కోరుకోవడం లేదని, ప్రపంచశ్రేణి నగరంగా నిర్మాణాన్ని జరుపుకోబోతున్న అమరావతికి మరింత వన్నెతెచ్చే సమావేశ మందిరం వుండాలని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డాక్టర్ షెట్టీకి తన అభిప్రాయాన్ని చెప్పారు.

అమరావతి కన్వెన్షన్ సెంటర్‌, ఐదు నక్షత్రాల హోటల్‌, ఎగ్జిబిషన్ సెంటర్‌లను ముఖ్యమంత్రి ఆశిస్తున్న మేరకు అంతర్జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా నిర్మించగలమని ఎన్ఎంసీ గ్రూపుకు సారధ్యం వహిస్తున్న పద్మశ్రీ బీఆర్ షెట్టీ చెప్పారు. ఒకేసారి 10 వేలమంది కూర్చునే సామర్ధ్యంతో ఈ ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్‌ను నెలకొల్పుతున్నామని, అంతర్జాతీయ పర్యటకుల్ని ఆకర్షించే స్థాయిలో ఐదు నక్షత్రాల హోటల్‌ను ఏర్పాటుచేస్తామని వివరించారు. అలాగే, ఎన్నో అంతర్జాతీయ ప్రదర్శనలకు మున్ముందు వేదికగా నిలిచే భారీ ప్రదర్శనశాలను నెలకొల్పుతామని అన్నారు. రాష్ట్రంలో అమరావతి సహా పలు ప్రాంతాల్లో పచ్చదనం పరిఢవిల్లే పర్యావరణ హితమైన గృహ సముదాయాల నిర్మాణానికి ఎన్ఎంసీ గ్రూపు ఉపక్రమించినట్టు డాక్టర్ షెట్టీ చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టులన్నీ 2018 నాటికల్లా పూర్తిచేయడానికి సిద్ధంగా వున్నామని డాక్టర్ బీఆర్ షెట్టీ ముఖ్యమంత్రికి వివరించారు.

అబుదాబికి చెందిన ఈ అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజం నవ్యాంధ్రప్రదేశ్‌లో మొత్తం 3500 పడకలతో కూడిన మూడు ప్రపంచశ్రేణి ఆసుపత్రులను నెలకొల్పనుంది. వీటి వివరాలను కూడా డాక్టర్ షెట్టీ ఈ భేటీలో ముఖ్యమంత్రికి సవివరంగా తెలియజేశారు. ఇవి హృద్రోగ, మధుమేహ, కేన్సర్ విభాగాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందులో ఒకటి 1500 పడకల ఆసుపత్రిగా రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో ప్రారంభిస్తామని, 300 పడకలతో మరొకదాన్ని రాయలసీమ ముఖద్వారంగా వున్న కర్నూలులో నెలకొల్పుతామని తెలిపారు. ఇవిగాక 1700 పడకలతో కూడిన ఆసుపత్రులను రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో ఏర్పాటుచేయనున్నామన్నారు.

అలాగే, వైద్యరంగంలో పరిశోధనలకు ఊతమిచ్చే ప్రపంచస్థాయి వైద్య వైశ్లేషిక కేంద్రాన్ని (మెడికల్ అనలిటిక్ సెంటర్‌), ఆసియాఖండంలోనే మొదటిదైన క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో నెలకొల్పుతున్నట్టు డాక్టర్ షెట్టీ సీయంకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన వైద్య విశ్వవిద్యాలయాన్ని కూడా ఎన్ఎంసీ గ్రూపు నెలకొల్పనున్నది. దీనికి గ్లోబల్ ఐవీ లీగ్ యూనివర్శిటీ నాలేడ్జ్ పార్టనర్‌గా వుంటుందని డాక్టర్ షెట్టీ తెలిపారు. ఫైజర్, మెర్క్, అబాట్స్ ( pfizer, merck, abbots) వంటి ప్రసిద్ధ ఫార్మా కంపెనీల సహకారంతో ఏపీలో ఒక ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని కూడా ఎన్ఎంసీ గ్రూపు సంకల్పించిందని చెప్పారు.

కేన్సర్ చికిత్సలో నూతన సాంకేతికత, ఆవిష్కారాలకు దోహదపడే పరిశోధన కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్నామని ఎన్ఎంసీ అధినేత చెప్పారు. ఇవి కేన్సర్ వ్యాధి నిరోధక, నిర్ధారక, నియంత్రణ కేంద్రాలుగా పనిచేస్తాయన్నారు. జపాన్‌కు చెందిన మిత్సుబిషీ ఫార్మాస్యూటిక్, కాస్మో ఆయిల్ కంపెనీల సహకారంతో వీటిని నెలకొల్పుతున్నామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వున్న అనేక వైద్య సంస్థలకు వైజ్ఞానిక సంబంధిత అంశాలను సమకూర్చేందుకు వీలయ్యే నాలేడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సెంటర్‌ను కూడా ఏపీ కేంద్రంగా నెలకొల్పుతున్నట్టు డాక్టర్ షెట్టీ తెలియజేశారు.

ప్రపంచం మెచ్చే మేటి నగరంగా నిర్మాణం జరుపుకోబోతున్న అమరావతికి అంతర్జాతీయ హోదా, హంగు కల్పించేందుకు దోహదపడే వరల్డ్ క్లాస్ గోల్ఫ్ కోర్స్‌ను షెట్టీ గ్రూపు ఏర్పాటుచేస్తోంది.

ఏపీలో ఇంత పెద్దఎత్తున పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొచ్చిన బీఆర్ షెట్టీని ఏపీ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం తరుపున వీలైన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు. ఇలావుంటే, ప్రపంచవ్యాప్తంగా 30 ఆసుపత్రులను ఎన్ఎంసీ గ్రూపు నిర్వహిస్తోంది. హోటళ్లు, విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలను నడుపుతోంది. 25 వేలకు పైగా విద్యార్థులు ఈ సంస్థలలో విద్యను అభ్యసిస్తున్నారు.

వరల్డ్ బిగ్గెస్ట్ మనీ ఎక్స్ఛేంజిగా పేర్గాంచిన యుఏఈ ఎక్స్ఛేంజి-ట్రావెలెక్స్‌ ఎన్ఎంసీ గ్రూపుదే. 18కి పైగా దేశాలలో పంపిణీదారుగా వున్న నియో ఫార్మా మాన్యుఫాక్చరింగ్ ఫార్మాస్యూటికల్స్ ఈ గ్రూపుదే. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ షెట్టీ ఫోర్బ్స్ ప్రకటించిన బిలియనీర్స్ జాబితాలో వున్నారు. అబుదాబి యుఏఈ బిజినెస్ కౌన్సిల్‌కు తాజాగా జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అబుదాబి ఇన్వెస్టుమెంట్ అధారిటీ కోసం పనిచేస్తున్న డాక్టర్ షెట్టీ ఏపీకి పెట్టుబడులు తేవాలన్న దృక్పధంతో వున్నారు.