అంతర్జాతీయ మార్కెట్లో పంట ఉత్పత్తుల విక్రయం

Chandrababu-master-planమరో మూడేళ్లలో రైతులు ఆదాయంలో కార్పోరేట్ కంపెనీలకు దీటుగా ఎదగాలని,అందుకు అనువైన పరిస్థితులను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం సీఎంఓలో 23 మైక్రో ఇరిగేషన్ సీఈఓలు, వ్యవసాయ శాఖాధికారుల సమావేశంలో మాట్లాడుతూ పంట ఉత్పాదక సంఘాల (food producers organizations) ద్వారా తన స్వప్నం నిజం అవుతుందన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తంచేశారు.

ఈ సంఘాల ద్వారా రైతులు తమ ఉత్పత్తుల ధరలను తామే నిర్ణయించుకోవచ్చన్నారు. కోకోను క్యాడ్‌బరీస్ కంపెనీ, పొగాకు, పసుపు, మిర్చిని ఐటీసీ కొనుగోలు చేస్తాయన్నారు. ప్రపంచంలోని టాప్ టెన్ కంపెనీలతో మాట్లాడి పంటలు వేసే రైతాంగానికి సహకారం అందించాలని కోరారు. కేవలం రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే ఏర్పాట్లు చేయటమే కాకుండా,వారిలో వాణిజ్య పంటలపై చైతన్యం కలిగించాలని కోరారు.
అంతర్జాతీయ విపణితో ఉత్పత్తులను విక్రయిస్తే రైతులు అధిక లాభాలను ఆర్జించవచ్చన్నారు వ్యవసాయంలో తనకు 33% శాతం వృద్ధి రేటు కన్పించాలని, అందుకు అవసరమైన చర్యలకోసం వ్యవసాయాధికారులు ఏం అడిగినా చేస్తానని తనకు ఫలితం ముఖ్యమని సీఎం చెప్పారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ విజయకుమార్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.