ప్రజా సాధికార సర్వేకు ఇంజనీరింగ్ విద్యార్ధుల భాగస్వామ్యం

babu-survyరాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులను ప్రజా సాధికార సర్వేలో ఎన్యూమరేటర్లుగా వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పల్స్ సర్వే కార్యక్రమ పురోగతిని గురువారం ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా ఉండవల్లి లోని తన నివాసం నుంచి విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ ఓలు పాల్గొన్నారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్డీఓ చేసిన సూచనను ముఖ్యమంత్రి స్వాగతిస్తూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు పల్స్ సర్వే బృందాలకు శిక్షణనిస్తారని చెప్పారు. ఇందుకు ఒక కార్యక్రమం రూపొందించాల్సి ఉందని సీఎం చెప్పారు. ప్రజా సాధికార సర్వేను తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నానని, అధికారులు, సిబ్బంది కూడా బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి జిల్లాకు జనాభా ప్రాతిపదికన 32 నుంచి 33,000 బృందాలు ప్రజా సాధికార సర్వే చేస్తున్నాయన్నారు.

ప్రజాసాధికార సర్వే వేగం పుంజుకోవాలని, ఆషామాషీగా భావిస్తే కఠిన చర్యలకు వెనుకాడేది లేదని సీఎం చెప్పారు.సర్వర్ విఫలమయ్యింది లాంటి సాంకేతిక అంశాలను కారణంగా చెప్పి తప్పించుకోవాలని చూడవద్దని ముఖ్యమంత్రి అన్నారు. సేకరించే సమాచారంలో కచ్చితత్వం ఉండాలని, సమగ్రత ఉండాలని ఆయన సూచించారు. 5 వ తేదీలోగా పెన్షన్లు ఇచ్చేవారికి పెన్షన్ సొమ్ము చెల్లించి, తిరిగి సిబ్బంది సమగ్రసర్వేలో బిజీ కావాలని, పై అధికారులు వేరే చెప్పినా వినకుండా సమగ్ర సర్వేకు కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు.సాంకేతిక సమస్యలు వస్తుంటాయి. అంతమాత్రం చేత సర్వేను పక్కన పెడితే సహించనని ముఖ్యమంత్రి చెప్పారు. వర్షాలు పడిన తర్వాత కూడా సమగ్ర సర్వే చేశామని, బుధవారం నాడు 3 లక్షల 42 వేల ,751 గృహాలలో

9 లక్షల 12 వేల 787 మంది నుంచి వివరాలు సేకరించామని చెప్పారు.

ఇటీవల తాను చైనా, రష్యా, కజకిస్థాన్ దేశాల్లో పర్యటించినప్పుడు సీఎం డ్యాష్ బోర్డు లో రియల్ టైమ్ మానిటరింగ్‌పై వివరించినప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారని చంద్రబాబు తెలిపారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వటాన్ని వారు మెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పుడు టెక్నాలజీ, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) ఆధారంగా నాలుగో పారిశ్రామికవిప్లవం నడుస్తున్నదని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవటంలో ముందుండి, ఆ ఫలితాలను మనమే ముందు పొందాలన్నది తన ఆశయమని చంద్రబాబు అన్నారు.

సర్వే సమగ్ర సమాచారాన్ని ప్రతిరోజూ సాయంత్రం, లేదా రాత్రికల్లా అప్ డేట్ చేసి, విశ్లేషించాలని ముఖ్యమంత్రి కోరారు. ఉన్నతాధికారులు, మంత్రులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారులు డేటాను పరిశీలించాలన్నారు. ప్రజా సాధికార సర్వేకు నెట్‌వర్కింగ్, కచ్చితత్వం,నాణ్యతతో కూడిన సాచారం చాలా అవసరమని సీఎం చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, డివైడర్ చేసే ఉద్యోగి, ట్రెయినింగ్ ఇచ్చే ఉద్యోగి, ఇన్నోవేషన్‌లో ప్రవేశం ఉన్న ఉద్యోగి..ఈ నలుగురూ ఒక బృందంగా ఉంటే బాగుంటుందన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు కంట్రోల్ రూమ్‌ను చైతన్యపరిచే స్థితిలో ఉండాలని కోరారు. సాంకేతిక సమస్యలు వస్తే సరిచేసుకోవాలని, డివైడర్ తొలగించి మరొకటి అమర్చాలని, సాఫ్ట్ వేర్ సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

కలెక్టర్ సహా ప్రతి ఒక్కరూ విడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాల్సిందేనని, ఇందుకు మినహాయింపులేమీ లేవని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక పర్యాయం చెప్పిన తర్వాత చేయాల్సిందేనని, ఇష్టప్రకారం వ్యవహరించవద్దని కోరారు. తాను పనిని ప్రేమిస్తానని, నిబద్ధతను ఇష్టపడతానని చంద్రబాబు చెప్పారు.

అందరూ విడియో కాన్ఫరెన్స్ కి రావాలి. అంతా సమాచారం సేకరించి విశ్లేషించాలన్నారు. తాను అధికారుల ప్రతిభను గుర్తిస్తానని తెలిపారు. ప్రతిరోజు మంత్రులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సర్వేపై శ్రద్ధ చూపించాలని కోరారు. తాను టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంటున్నట్లు అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మార్వో ముఖ్యమంత్రికి తెలుపగా ఆయన్ని అభినందించారు. ఎంఆర్ఓలు ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను సన్నద్ధం చేస్తే బాగుంటుందని సూచించగా ముఖ్యమంత్రి ఆయన సూచనను స్వాగతించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ ఐటి కార్యదర్శి శ్రీ ప్రద్యుమ్న మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు ఏవివచ్చినా సర్వర్ డౌన్ అయ్యిందని అంటున్నారని, ఇది ఒక సాధారణ వ్యక్తీకరణ అయ్యిందని చెప్పారు. సాఫ్ట్‌వేర్ సమస్యలు, సాంకేతిక సమస్యలను 99% పరిష్కరించినట్లు తెలిపారు.సాయంత్రం గం. 5.30 నుంచి గం. 6.30 వరకు సర్వర్ స్లో అవుతోందని, తర్వాత ఈ సమస్యను చక్కదిద్దినట్లు వివరించారు. విడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు డా. పల్లె రఘునాథరెడ్డి, శ్రీ పైడి కొండల మాణిక్యాలరావు పాల్గొనగా మంత్రి నారాయణ ముఖ్యమంత్రి నివాసంలో కార్యక్రమానికి హాజరయ్యారు.