ఆదాయపన్ను అధికారుల భరతంపడతాం!

Gadkariభారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థానం నుంచి వైదొలిగిన నితిన్ గడ్కరీ ఈరోజు స్వేఛ్చగా తన మనసులోని ఆసక్తికరమైన మాటలను వెల్లడించారు. తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఐటీ అధికారులను కాంగ్రెస్ పావులా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. తన కంపెనీలోకి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయంటూ తప్పుడు ఆరోపణలతో దాడులు చేసి, విచారణ చేపట్టిన ఆదాయపు శాఖ అధికారుల సంగతి కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన అనంతరం చూస్తామని గడ్కరీ హెచ్చరించారు.

2014లో కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుందని, ఒకసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే సోనియా, చిదంబరం ఎవరూ వారిని (ఆదాయపన్ను అధికారులను) కాపాడలేరని తెలిపారు. ఢిల్లీ, ముంబాయి, నాగ్ పూర్ లలో కూర్చుని తనపై కుట్రలు పన్నుతున్నారని, ఆ శాఖలో తమ పార్టీ పట్ల సుహృద్భావం కలిగినవారూ ఉన్నారని, తనకి అన్ని విషయాలూ తెలుస్తూనే ఉన్నాయని గడ్కరీ చెప్పారు.