టీఆర్ఎస్ లో చేరికపై డీకే స్పందన

dk
చాన్నాళ్లుగా మాజీ మంత్రి, గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ టీఆర్ఎస్ చేరబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, కొన్నాళ్లుగా గద్వాల్ జిల్లా కోసం డీకే ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే తాను రాజీనామా చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు.

డీకే ముఖ్యమంత్రిని కలసి రాజీనామా పేరుతో ఓ లేఖని అందించిన తర్వాతనే.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో సమీకరణాలు మారాయి. కొత్త జిల్లాల లిస్టులో తీవ్ర డిమాండ్ లో ఉన్న గద్వాల్, జనగాం, సిరిసిల్ల లతో పాటు పెద్దగా డిమాండ్ చేయని ఆసిఫాబాద్ ని కూడా కొత్త జిల్లాల లిస్టులో చేర్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అయితే, డీకే టీఆర్ఎస్ లో చేరడం ఖాయం చేసిన తర్వాతనే గద్వాల్ జిల్లాకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. అతి త్వరలో డీకే కారెక్కడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లోనూ గుసగుసలు వినపడ్డాయి.

తాజాగా, టీఆర్ఎస్ లో చేరికపై డీకే స్పందించారు. కె. కేశవరావుతో సమావేశమైన అనంతరం డీకె విలేకర్లతో మాట్లాడుతూ.. “తాను టీఆర్ఎస్ లో చేరుతున్నాననడం శుద్ధ అబద్ధమని.. గద్వాల్ జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించేందుకు మాత్రమే తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించా”నన్నారు.

అయితే, ఎప్పుడూ లేని విధంగా సీఎం కేసీఆర్ కాస్త పాజిటివ్ గా మాట్లాడుతూ వచ్చింది డీకె. ఆమెలోని మార్పును బట్టి చూస్తే.. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్ లో కాంగ్రెస్ లో పీసీసీ పగ్గాలు దక్కకపోతే అసంతృప్తి పేరుతో గులాభి గూటికి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. డీకె నిజంగానే కారెక్కుతుందో.. ? చూడాలి.