లగడపాటి రాజకీయ బఫూన్ గా మారుతున్నారా ?

Lgadapatiవిజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేస్తున్న చేష్టలు, విన్యాసాలు ఆయనను క్రమేపీ ఓ రాజకీయ బఫూన్ లా ఆవిష్కరిస్తున్నాయి. ఆదినుంచీ ఆయనకు పబ్లిసిటి మానియా అధికంగా వుందనేది ఆయనను అబ్జర్వ్ చేస్తున్న వారికి ఎవరికైనా అర్ధం అవుతుంది. ఆయన సర్వేలు చేసినా, ప్రసంగాలు చేసినా, ప్రెస్ మీట్లు పెట్టినా , వివాదాస్పద ప్రకటనలు చేసినా అవన్నీ కేవలం మీడియా కోసమేనన్నది సుస్పష్టం. రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆయన చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావటమే కాకుండా కొన్ని సందర్భాలలో రెండు ప్రాంతాల ప్రజల మధ్య మానసిక అంతరాలు సృష్టించేందుకు కూడా కారణం కావటాన్ని ఎవరూ కాదనలేరు.

rajgopalతెలంగాణా సాధన కోసం ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకుల మాదిరిగా ఏనాడూ లగడపాటి సమైక్యాంధ్ర కోసం అధిష్టానం దగ్గర గట్టిగా తన వాదనలు వినిపించిన దాఖలాలు లేవు. ఆయన వాదనలన్నీ కేవలం మీడియా కు మాత్రమే పరిమితమై పోవటం గమనార్హం. నిత్యం మీడియా లో కనిపించటం, వినిపించటం ద్వారా ప్రజలకు చేరువ కావాలని, వారి అభిమానాన్ని సంపాదించుకోగలమనే ఆయన ఆలోచన, ప్రయత్నం, తాపత్రయం నవ్వు తెప్పిస్తుంది. సిన్సియర్ గా డిల్లీ లో కూర్చుని ఒక పార్లమెంటు సభ్యుడిగా తనకున్న ఆలోచనలను పార్టీ పెద్దల దగ్గర వినిపించే ప్రయత్నం లగడపాటి ఏనాడూ చేయలేదు. ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి ఆయన తెలుగుదేశం పార్టీ ని విమర్శించటమో , చంద్రబాబు ను దుమ్మెత్తి పోయటమో అజెండా గా పెట్టుకున్నారు తప్ప కాంగ్రెస్ అధిష్టానం వైఖరిని వేలెత్తి చూపే సాహసం చేయకపోవటంతో ఆయన వాదనల్లో , ఆరోపణల్లో పస లేకుండా పోయింది.

Lagadapatiతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న” వస్తున్నా…మీ కోసం ” పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన మొదటి రోజున ఆయన చేసిన హడావిడి ఆయన ను ఓ కమెడియన్ గా నిలబెట్టాయి. ఒంటిమీద చొక్కా లేకుండా లుంగీ కట్టుకుని , మీడియాకు ఫోటో లు ఇస్తూ ఆయన చేసిన విన్యాసాలు రాజకీయ విశ్లేషకుల్లో మాత్రమే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఓ విధమైన ఏవగింపు కలిగించాయి. అంత గందరగోళం చేసినా ఆయన ఫీట్లు ఏవీ చంద్రబాబు యాత్రను అడ్డుకోలేకపోయాయి. జనం బాబుకు బ్రహ్మరథం పట్టారు. కార్యకర్తలు ఆయన వెంట సైనికుల్లా నడిచారు.. ఎమ్మార్పిఎస్ సభ్యులు ఆయనకు రక్షక దళం గా నడిచారు. దాంతో లగడపాటి తోక ముడిచారు. అవహేళన పాలయ్యారు. ఈయన చేష్టల వల్ల ఆయన వ్యక్తిగతంగానే కాకుండా పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బ తింటోందని స్వయానా కాంగ్రెస్ పార్టి నాయకులే నానా బూతులు తిట్టారు.” కనువిప్పు ” పేరుతో లగడపాటి చేపట్టిన కార్యక్రమం ముందు ఆయనకే కనువిప్పు కలిగిస్తే కృష్ణా జిల్లాలో పార్టీ బతికి బట్టకడుతుందని పలువురు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

2009122061021001నిన్న ( సోమవారం ) మరో సారి విజయవాడలో చంద్రబాబు యాత్రను అడ్డుకునే చేసిన లగడపాటి అలవాటుగానే భంగపడ్డారు. రెండు మూడు కార్లలో ఆయన అడ్డుకునేందుకు బయలుదేరిన లగడపాటి పోలీసులతో కూడా కాస్సేపు ఆడుకున్నారు . వారిని కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. ఈయన గారి సంగతి తెలిసిన బెజవాడ పోలీసులు ఆయన ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి వెనక్కు పంపేసారు. ఈ ప్రయత్నంలో ఆయన తనవెంట మీడియా వారిని కూడా తీసుకువెళ్ళటం చూస్తే ఆయనకున్న మీడియా మానియా అర్ధం అవుతుంది. అసలు అంతటి జనప్రవాహంలో లగడపాటి ఇలాంటి ప్రయత్నం చేయటం ఒకవిధంగా దుస్సాహసమే అవుతుంది. అలాకాకుండా గౌరవప్రదమైన రీతిలో , ఒక పార్లమెంటు సభ్యుడిగా ముందే సమాచారం పంపి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనను కలిసి తన అభిప్రాయాన్ని తెలిపివుంటే హుందాగా వుండేది. అలా కాకుండా ఇలా చౌకబారు రీతిని లగడపాటి ఎందుకు ఎంచుకున్నారో అంతుబట్టని విషయం.

మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపధ్యంలో లగడపాటి ఇలా కాకుండా ప్రజా ప్రయోజన కార్యకలాపాలపై దృష్టి సారించి ప్రజలలో తన మీద నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుకునేందుకు కష్టపడితే మరోసారి రాజకీయంగా సత్ఫలితాలను సాధించవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.