కిరణ్ ను దింపాలని బొత్స…! : జోగి రమేష్

jogiramesh-botsaసీఎం పదవి నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని దింపేందుకు పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారని పెడని ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు తానెప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. తానేమీ భుజాలు తడుముకోవట్లేదని.. నేను తప్పుచేసినట్టు బొత్స నిరూపించగలడా? అని సవాల్ విసిరాడు. తప్పుచేసినట్టు భావించే ఎమ్మెల్యేలకు మొదట షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా మాట్లాడమేంటని ప్రశ్నించారు.

తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను ఎందుకు బహిష్కరించారో బొత్స సమాధానం ఇవ్వాలని.. అందులో నా పేరు కూడా ఉన్నట్లయితే నాకు కూడా సమాధానం కావాలని చెప్పారు. సంఖ్యా బలం లేదని బొత్సనే అంగీకరించినప్పుడు పరిపాలన చేసే అర్హత కాంగ్రెసు పార్టీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం రావణ కాష్టంలా తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రగులుతుంటే పరిష్కారం చూపకుండా ఎంత కాలం నానుస్తారని మాత్రమే తాను అడిగానని, రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, దానికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని రమేష్ చెప్పారు.