అమరావతిలో ప్రపంచ స్థాయి ఆస్పత్రి

Kings-college-hospitalఆంధ్రప్రదేశ్ వైద్య, విద్యా, విజ్ఞాన కేంద్రంగా రూపొందనుంది. రాజధాని అమరావతి ఇది నిజంగా మహర్దశగా అభివర్ణించాలి. నవ్యాంధ్ర రాజధానిలో ఇండో యుకె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కింగ్స్ కాలేజీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆస్పత్రిని నిర్మించబోతోంది. వేయి కోట్ల పెట్టుబడితో, పదకొండు వందల పడకలతో అధునాతన ఆస్పత్రి ఏర్పాటుకానుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలో మరో 10 ఆసుపత్రులు నిర్మితం కానుండగా, వీటన్నింటి కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా రూపుదాల్చబోతోంది. మంగళవారం సీఎంఓలో ముఖ్యమంత్రి చంద్రబాబు యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. లివర్ వ్యాధుల చికిత్సలో ప్రపంచస్థాయి ఆస్పత్రిగా పేరున్న కింగ్స్ కాలేజీ గతంలో కుదుర్చుకున్న ఎంఓయూ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన ఈ ఆస్పత్రిని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.

కింగ్స్ కాలేజ్ ప్రతినిధులు తమ మాస్టర్ కాన్సెప్ట్ మీద ప్రెజెంటేషన్ ఇచ్చినప్పడు ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా విన్నారు. ప్రజారోగ్యం విషయంలో తన ఆలోచనలను పదిహేను నిమిషాల పాటు నిలబడి అధ్యాపకునిలా వారికి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ, ఇతర వైద్య సదుపాయాలను వివరించారు. యూకే లో ప్రభుత్వ వైద్య ఆరోగ్య విధానాలను, మాస్టర్ హెల్త్ కాన్సెప్ట్‌పై అక్కడ ప్రభుత్వ విధానం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.
అమరావతిలో కేవలం ఒక్క ఆస్పత్రి నిర్మిస్తే విశేషం కాదని, కేంద్రప్రభుత్వం యూకేతో చేసుకున్న ఒప్పందం మేరకు మనదేశంలో వివిధ రాష్ట్రాలలో 11 వైద్య విజ్ఞాన సంస్థలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతాయని, ఈ సంస్థల కార్యకాలాపాలకు అమరావతి కేంద్రం అవ్వనుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం తాను తీవ్ర కృషి చేస్తున్నట్లు వివరించారు. 11 సంస్థల కేంద్ర కార్యాలయాలు అమరావతిలో నెలకొల్పితే అనుబంధ రంగ పరిశ్రమలు ఏర్పాటవుతాయని, రెండు లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒక పెద్ద ఆస్పత్రిలో 11 వందల బెడ్లు ఉంటే ఏడాదికి కోటి గ్లోవ్స్ కావాలని, వైద్యులు, రోగులు వేసుకునే కోటి గౌన్లు కావాలని, ఇలా అనుబంధ రంగ వస్తువుల పరిశ్రమలు ఏర్పాటైతే లక్షలాదిగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ముంగిటకు వస్తాయని ముఖ్యమంత్రి తన విజన్ ను వివరించినప్పుడు యుకె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రతినిధులు ఆయన్ని అభినందించారు.

అమరావతిలో ఏర్పాటు చేసే ప్రపంచస్థాయి అధునాతన ఆస్పత్రి ఐకానిక్ గా ఉండాలని, ప్రధాన భవనాన్ని సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడే భవనంగా నిర్మించాలని కోరారు. నిర్మాణాలు ఉన్న ప్రాంతమంతా హరితంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇదిలా ఉంటే..అమరావతిలో కింగ్స్ కాలేజీ సహకారంతో ఇండో యూకే హెల్త్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పనున్న ప్రపంచ స్థాయి ఆస్పత్రి నిర్మాణానికి జూన్ 5 వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన జూన్ 5న ప్రధానికి వీలుకాని పక్షంలో జూన్9 కి శంకుస్థాపన తేదీ మారే అవకాశాలున్నాయి.

ఈ సమావేశంలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ శ్రీ జాస్తి కృష్ణకిశోర్, ఇండో-యుకె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ చైర్మన్‌ మైక్‌ పార్కర్‌, హెల్త్ కేర్ యూకే ఇండియా-మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా స్పెషలిస్ట్ మైక్ నిథావ్రియాంకిస్ (mike nithavrianakis), ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ జి. సాయి ప్రసాద్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అజయ్ జైన్, సీఎంఓ సహాయ కార్యదర్శి శ్రీ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.