గద్దర్ గజ్వెల్, కోదండ రామ్ జనగామా.. !


తెలంగాణలో ఏయే స్థానం నుంచి ఏ అభ్యర్థి బరిలోకి దిగబోతున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చేస్తోంది. మహాకూటమిలో సీట్ల సర్థుబాటు దాదాపు కొలిక్కి వచ్చేసింది. తెలంగాణ టీడీపీ 14 సీట్లు, టీజెఎస్ కు 8సీట్లు, సీపీఐకి 3, ఇతర పార్టీ ఒక్కస్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. సీపీఐకి మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలని ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారమ్.

ఇక, కేసీఆర్ పై పోటీ దిగబోతున్నట్టు గద్దర్ ప్రకటించేశారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదు. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, టీజెఎస్ అధినేత కోదండరామ్ పోటీ చేసే స్థానంపై కూడా దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఆయనకు కాంగ్రెస్ రెండు ఆప్షన్స్ ఇచ్చింది. రామగుండం లేదంటే జనగామ నుంచి పోటీ చేయాలని కోదండరాం భావిస్తుండడంతో ఏ స్థానాన్ని ఎంచుకుంటారో తేల్చుకోవాలని కాంగ్రెస్ కోరింది.

ఈ రెండింటిలో కోదండరామ్ జనగామని ఎంచుకొనేందుకు ఆసక్తిని చూపుతున్నారంట. జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్యమంలో కోదండరాం చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక, జనగామలో కోదండరాం బంధువులు చాలామంది ఉండడంతో కోదండరాం ఈ స్థానాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరీ.. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఏంటన్నది చూడాలి.