పంచాయితీ పారిశుద్య సమ్మె వాయిదా..

panchatithi-raj
పంచాయితీ పారిశుద్య కార్మీకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీందర్ నాయక్ తో పాటు పారిశుద్య కార్మీక సంఘాలతో చర్చలు జరిపారు. కనీస వేతనాలతో పాటు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని గత 44 రోజులుగా పారిశుద్య కార్మీకులు సమ్మె కొనసాగిస్తున్నారు. 30 వేల మంది కార్మీకులు విధులను బహిష్కరించారు. వారితో పలు దఫాలుగా మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. వారి సమస్యల పై సానుకూలంగా స్పందించారు. సమస్యల అధ్యయనం, పరిష్కారం కోసం పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని వేశారు. పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్ కమీషనర్లు, అర్ధిక శాఖ, న్యాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. రెండు నెలలో కమిటీ తన నివేదిక సమర్పించనుంది. నివేదిక కు అనుగుణంగా సమస్యలను పరిష్కరిస్తానని ప్రభుత్వం హమీ ఇచ్చింది.

కనీస వేతనాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వేతనాలను కార్మీకుల బ్యాంకు ఖాతాల్లో జమచేసే విధంగా చర్యలు చేపట్టనుంది. దాంతో పాటు వారికి గుర్తింపు కార్డులను సైతం మంజరు చేయనుంది. పంచాయితీ ఆదాయాల నుంచి 50 శాతం నిధులను కార్మీకుల వేతనాల కోసం వెచ్చించే వెసులు బాటును కూడా పంచాయితీలకు కల్పించనుంది. ప్రతి డిమాండ్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దాంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ జ్యోతి కార్యక్రంలో పారిశుద్య కార్మీకులు పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి.

ప్రభుత్వ హమీతో సమ్మెను విరమిస్తున్నట్లు కార్మీక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం కోరిన గడువు లోపు సమస్యలను పరిష్కరించాలని కోరాయి. లేని పక్షంలో సమ్మెను తిరిగి కొనసాగించనున్నట్లు ప్రకటించాయి. సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా ప్రభుత్వం స్పందించడం పంచాయితీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

కాగా రెండు నెలల గడువు లోపు సమస్యలను పరిష్కరించక పోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది.